గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హతా వేటు వేయింంచాలని అనుకుంటే అది బీజేపీ చేతుల్లోనే ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏ పార్టీ బీఫాంపై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హతా వేటు పడుతుంది. కానీ అది ఆటోమేటిక్ గా కాదు. ఆ పార్టీ నుంచి స్పీకర్ కు ఫిర్యాదు రావాలి. అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాజాసింగ్ విషయంలో బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సస్పెండ్ చేసి ఉంటే.. అనర్హతా వేటు వేయాలని కోరే చాన్స్ ఉండేది కాదు. కానీ రాజాసింగ్ స్వయంగా రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ చేతిలోనే బాల్ ఉంది.
బీజేపీకి రాజీనామా చేస్తే తనను బుజ్జగిస్తారని రాజాసింగ్ అనుకున్నారు. కానీ ఆయన పై హైకమాండ్ కు పూర్తి స్థాయిలో విరక్తి వచ్చేసింది. దేశంలో మత విద్వేషాలు రగిలేలా ఓ వీడియోను అప్ లోడ్ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పీడీయాక్ట్ పెట్టి జైల్లో వేసింది. ఆ సమయంలోనే రాజా సింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. మళ్లీ అతి కష్టం మీద ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేయించుకుని టిక్కెట్ పొందారు. కానీ ఏడాదిన్నరలోనే బీజేపీనే చాలెంజ్ చేసేంతగా మారిపోయారు. ఇప్పుడు ఆయనను పార్టీ వద్దనుకుంది. మళ్లీ తీసుకునే చాన్స్ ఉండదు.
అయితే బీజేపీ ఇప్పుడు ఉన్న పళంగా ఆయన పదవిని ఊడగొట్టాలని అనుకునే అనుకునే అవకాశం లేదు. హిందూత్వం కోసం తన వాదన వినిపిస్తూనే ఉంటానని ఆయన తర్వాత స్పందించారు. బీజేపీని ఆయన టార్గెట్ చేసే అవకాశాలు లేవు. బీజేపీలోని కొంత మంది నేతలపైనే ఆయన అసంతృప్తి . అందుకే ఆయన పదవిని ఊడగొట్టాలని బీజేపీ అనుకోకపోవచ్చు. అనర్హతా పిటిషన్ దాఖలు చేయకపోవచ్చని భావిస్తున్నారు.
ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశానని.. ఆ లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చానని రాజాసింగ్ ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం అలాంటిదేమైనా ఉంటే నేరుగా స్పీకర్ కు లేఖ ఇచ్చుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు రాజాసింగ్ అలాంటి ప్రయత్నం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఉపఎన్నికలు తెచ్చుకుని కిందా మీదా పడేందుకు ఆయన కూడా తొందరపడకపోవచ్చు. అంటే రాజాసింగ్ పై అనర్హతా బీజేపీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు బీజేపీ అలాంటి పని పెట్టుకోకపోవచ్చు.