దేశంలో కొంత మంది అపరిమిత మేధావులు ఉంటారు. తమకు నచ్చని వారు ఏది చెప్పినా వ్యతిరేకించడం వారి శైలి. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పెద్దలు ఎందుకు చెబుతున్నారు అన్నది కూడా ఆలోచించే ఓపిక వారికి ఉండదు. మాటల్లో ఉన్న చిన్న చిన్న తేడాలను చూసుకుని ట్రోలింగ్ చేసి మానసిక ఆనందం పొందుతూ ఉంటారు.
పిల్లల్ని కంటే లక్షలు ఇస్తున్న చైనా
చైనా ఒకప్పుడు ఒక్క బిడ్డచాలు అని ప్రజల్ని ఆదేశించింది. బలవంతగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది. రెండో బిడ్డను కంటే జరిమానాలను విధించింది. ఎన్నో ఏళ్ల కిందట కాదు.. రెండు, మూడు దశాబ్దాల కిందటి వరకూ జరిగింది ఇదే. ఇప్పుడు ఏం జరుగుతోంది ?. రెండో బిడ్డను కంటే పన్నెండు లక్షలు ఇస్తోంది. మూడో బిడ్డను కంటే ఆ బిడ్డకు ఎంత ఖర్చు అయితే అంత భరించేందుకు సిద్ధపడింది. ఎందుకు ?. తరిగిపోతున్న జనాభాతో దేశం క్లిష్టపరిస్థితుల్లోకి పోతోంది. ఏ మ్యాన్ పవర్ ఆసరాతో ప్రపంచశక్తిగా ఎదిగిందో ఆ మ్యాన్ పవర్ తగ్గిపోతోంది.
భారత్ మేలుకోవాల్సిన అవసరం లేదా ?
భారత్ లోనూ జనాభా తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యుత్పత్తి రేటు తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ భారత్ పరిస్థితి పూర్తిగా దిగజారలేదు. యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. నేడూ..రేపూ ప్రజలే దేశాలకు బలం అవుతారు. అందుకే.. పిల్లల్ని కనడం మారవద్దని పెద్దలు కోరుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువతరం మనోభావాలు మారుతున్నాయి. ఒక్కరు ఉంటే చాలనుకుంటున్నారు. మెల్లగా ఆ ఒక్కరు కూడా ఎందుకనే భావనకు వస్తున్నారు. ఇది దేశ భవిష్యత్ కు ప్రమాదం. అందుకే పిల్లల్ని కనమని సలహాలిచ్చేవారు పెరుగుతున్నారు.
జనాభాను పెంచాలని చంద్రబాబు చెప్పడం తప్పా ?
జనాభా పెరుగుదల వల్ల ఒకప్పుడు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు తగ్గిపోవడం వల్ల వస్తున్నాయి. జనాభాను పెంచాలని చంద్రబాబు ఎక్కువగా మాట్లాడుతున్నారు. విజన్ ఉన్నలీడర్ గా భవిష్యత్ లో వచ్చే సమస్యలను ఆయన ఇప్పుడు చెబుతున్నారు. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి కానీ.. ఆయనను ట్రోల్ చేస్తే దేశ సమస్య తీరిపోతుందా?. కామన్ సెన్స్ మిస్ అయిన వారి వల్లే సమాజానికి పెను ప్రమాదం ఏర్పడుతోంది.