శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ వినూత కోటతో పాటు ఆమె భర్త చంద్రబాబును చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వినూత వద్ద పని చేస్తున్న పీఏ ప్లస్ డ్రైవర్ చెన్నైలో హత్యకు గురయ్యారు. పోలీసుల విచారణలో వినూత దంపతులే హత్యకు కారణం అని తేలడంతో అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేశారు. వినూత కోటను అరెస్టు చేసినట్లుగా తెలియడంతో జనసేన పార్టీ నుంచి ఆ దంపతుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాళహస్తిలో వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు చేసే హడావుడికి హద్దే ఉండదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కానీ పొత్తులు ఖరారు అయిన తర్వాత సీటు తమకే అని మొదటగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కూడా వారు తగ్గలేదు. ఏదో ఓ అలజడి రేపుతూనే ఉంటారు. పలుమార్లు వారిపై దాడులు జరిగినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే చెన్నైలో ఏం వ్యాపారాలు చేస్తున్నారో.. ఆ పీఏ, డ్రైవర్ కు ఏ రహస్యాలు తెలిశాయో కానీ హత్య చేసేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం వారు చెన్నై జైలులో ఉన్నారు. పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో… వారిని తక్షణం బహిష్కరిస్తూ జనసేన నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం చిత్తూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది.