విజయసాయిరెడ్డికి ఏం చేయాలో అర్థమవుతున్నట్లుగా లేదు. ఓ వైపు వ్యవసాయం చేసుకుందామని అనుకుంటే.. ఇప్పటి వరకూ చేసిన పనులన్నీ వదిలి పెట్టేలా లేవు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేస్తే.. తాను రాలేనని .. మళ్లీ వచ్చే తేదీని తెలియచేస్తానని సమాచారం పంపారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో కర్మల మీద భగవద్గీతలో శ్లోకాన్ని పోస్టు చేశారు. దాని అర్థాన్ని కూడా చెప్పారు.
కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకాన్ని పోస్టు చేశారు. కర్మలను ఆచరించడమే మనపని అని వాటి ఫలితాలను ఆశించలేమని.. అలాగని చేయాల్సిన పనులు చేయకుండా ఉండలేమని చెప్పుకొచ్చారు. ఆయన బాధేంటో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. లిక్కర్ కేసులో చేసిన తప్పులన్నీ ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తుందని జగన్ రెడ్డికి హింట్ పంపినట్లుగా అనుమానిస్తున్నారు. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి నెంబర్ ఫైవ్ నిందితుడిగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం తనను తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకుంటున్నారు. అసలు నిజాలు మాత్రం మాత్రం చెప్పడం లేదు. పూర్తిగా రాజ్ కేసిరెడ్డిని ఇరికించి జగన్ ను బయట పడేద్దామని అనుకుంటున్నారు.
కానీ ఇప్పటికే లిక్కర్ కేసు చాలా ముందుకు వెళ్లిపోయింది. ఇప్పుడు రెండో సారి విచారణకు పిలవడంతో ఆయన కంగారు పడుతున్నట్లుగా చెబుతున్నారు. చాలా సాక్ష్యాలతో ఈ సారి విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అదే సమయంలో ఈ విషయంలో అన్నీ చెప్పక తప్పదని.. కర్మ సిద్ధాంతాన్ని జగన్ రెడ్డికి వినిపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఆయన ఎప్పుడు సీఐడీ విచారణకు హాజరవుతారో కానీ.. కర్మ ఫలితం అనుభవిచాల్సిందేనని ఆయనకు బాగా తెలిసి వచ్చిందని అనుకోవచ్చని సోషల్ మీడియాలో అభిప్రాయం వినిపిస్తోంది.