ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మ్యాప్ దిద్దుకున్నారు. నారా లోకేష్ కు అఖండ భారత సాంస్కృతిక వైభవం పేరుతో ఇచ్చిన మ్యాప్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చూపించారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై ఇప్పటి వరకూ స్పందించలేదు కానీ.. మ్యాప్ దిద్దుకున్న తర్వాత కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన రాంచంద్రరావును మాధవ్ మర్యాదపూర్వకంగా హైదరాబాద్‌లో కలిశారు. ఆయనకు కూడా లోకేష్‌కు ఇచ్చిన మ్యాప్ లాంటిదే ప్రజెంట్ చేశారు. అయితే అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు. తెలంగాణను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాధవ్ .. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు, చరిత్ర ముందు లొంగాల్సిందేనని స్పష్టం చేశారు.
తాను జాతీయవాదినని .. గర్వపడే తెలుగు వాడినని.. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో శాసనాల్లో చురుకుగా పని చేసినవాడినని చెప్పుకున్నారు. తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయవిమర్శలకు అతీతమని స్పష్టం చేశారు. రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచినవారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావని విమర్శించారు.
తెలంగాణ సెంటిమెంట్ పెంచే విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలి పెట్టని బీఆర్ఎస్.. ఈ మ్యాప్ వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేసింది. వెంటనే మాధవ్ వ్యూహాత్మకంగా చెక్ పెట్టేశారని అనుకోవచ్చు.