ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో రెండు ప్రత్యేకమైన ధీమ్స్ తో వచ్చారు. ఒకటి టీడీపి నేతల్ని పిరికిగా చెప్పుకోవడం, రెండు తనను తాను ధైర్యవంతుడిగా ప్రచారం చేసుకోవడం. ప్రత్యర్థులు హెచ్చరికలు జారీ చేస్తూంటే.. సంయమనం పాటించడమే దీనికి కారణం. ఆర్కే సంయమనం పాటించడం ధైర్యంగానూ.. టీడీపీ నేతలు అలా ఉండటాన్ని పిరికిగానూ అభివర్ణించేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రప్పా రప్పా నరికేస్తాం అంటున్నారు.. అయినా చర్యలు తీసుకోవడం లేదని ఆర్కే అంటున్నారు. తమ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిపై, అలాగే పోలీసుల చేతుల్ని నరికేస్తామని హెచ్చరించిన వెంకటేగౌడపై కేసులు పెట్టలేదని ఆయన భావిస్తున్నారు. వారు అలా రెచ్చిపోతున్నా..చట్టపరంగా కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన భయం, పిరికిగా చెబుతున్నారు. అలాంటి మాటలకు.. కేసులు పెట్టి అరెస్టు చేస్తే జైళ్లు సరిపోవు. రాష్ట్రంలో ఉన్న బాధ్యత లేని అరాచక శక్తులను కూడగట్టి ఇప్పుడు వైసీపీ ఇదే చేస్తోంది. ఎన్ని కేసులు పెడతారు.. ఎంత మందిని అరెస్టు చేస్తారు?.. దాని వల్ల సమస్య పెరుగుతూనే ఉంటుంది. దానికి కట్టడి చేయడానికి ఒక్క సారి తీసుకునే సరైన చర్య సరిపోతుంది. పోలీసులు బహుశా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ దీన్ని పిరికితనంగా చెప్పుకున్నారు ఆర్కే.. అది కూడా ఇప్పటి నుండి కాదట..ఎన్టీఆర్ సమయం నుంచి ఉందట.
అదే సమయంలో తన ధైర్యం గురించి ఆయన కితాబులు ఇచ్చుకున్నారు. ఎన్ని దాడులు చేసిన ఎవరికీ భయపడలేదన్నారు. అది నిజమే కానీ.. తనను భయపెట్టిన వారిపై ఆయన ఎప్పుడూ ముష్టి యుద్ధానికి వెళ్లలేదు. కుక్కలు అరిచాయని వదిలేసుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపారు. ఇప్పుడు తనను బెదిరిస్తున్న జగదీష్ రెడ్డి లాంటి వాళ్లను మరుగుజ్జులన్నారు కానీ.. వారి మాటల్ని పట్టించుకోవద్దని బీఆర్ఎస్ నుంచే తనకు సలహాలు వచ్చాయని చెప్పుకున్నారు. అందుకే తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తనపై, తన కార్యాలయాలపై దాడి చేస్తామని ప్రకటించినవారిపై ఆర్కే ఎందుకు కేసులు పెట్టలేదు?. తాను వారిని పట్టించుకోనని .. స్పందించనని కూడా ప్రకటించారు. అది ధైర్యం అయితే.. అదే వ్యూహం పాటిస్తున్న టీడీపీ క్యాడర్ ది పిరికితనం ఎలా అవుతుంది ?
ఆర్కే చెప్పేది ఎలా ఉందంటే… రెచ్చగొడుతున్న వైసీపీ రౌడీమూలకు.. వెంటనే తగిన బుద్ది చెప్పాలని.. లేకపోతే భయపడినట్లేనని అంటున్నారు. రాజకీయాలు అంటే వ్యక్తిగత శత్రుత్వం కాదు..ఏదైనా ప్రజాకోణంలోనే ఆలోచించి చేసుకుంటారు. ప్రతీ దానికి ఆవేశపడితే ఏం జరుగుతుందో ఇప్పుడు వైసీపీ ని చూస్తేనే అర్థమవుతుంది. ఆర్కే టీడీపీ క్యాడర్ అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలపై దాడులు చేసి కొట్టాలి.. అదే ధైర్యం అనుకుంటున్నారు ? . ఒకే ఆర్టికల్ లో ఇలా వైరుధ్యం ఉండి సమర్థించుకోవడం ఆయనకే సాధ్యం.