హిందీని పెద్దమ్మ అని పవన్ కల్యాణ్ అనే సరికి చాలా మంది లబలబలమంటూ తెరపైకి వచ్చేశారు. ముందు అమ్మకు భోజనం పెట్టాలని తెలుగు గురించి మాట్లాడుతూ బయలుదేరారు. అక్కడ అమ్మభాష తెలుగుకు భోజనం పెట్టి బతికించాల్సింది పవన్ కల్యాణ్ కాదు. ఆయన తన స్థాయిలో తెలుగును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. ఆయనపై కామెంట్ చేస్తూ బయలుదేరిన వాళ్లు నిజంగా తెలుగు విషయంలో తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారా అన్నదే అసలు ప్రశ్న.
పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్ ఏది సెలక్ట్ చేస్తున్నారు?
ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో కన్నా ప్రైవేటు స్కూళ్లలోనే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. సోషల్ మీడియాలో సమాజం కోసం బాధపడేవారంతా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చదివిస్తూ ఉంటారు. వారిలో ఎంత మంది తమ పిల్లలకు కనీసం సెకండ్ లాంగ్వేజ్ అయినా తెలుగు సెలక్ట్ చేస్తున్నారు…? ప్రీ ప్రైమరీ క్లాసుల్లోనే తెలుగు వద్దు తమకు హిందీ కావాలని సెలక్ట్ చేస్తున్నారు. హిందీ మాతృభాషగా ఉన్న వారు వారి మాతృబాష ఎంచుకుంటారు. కానీ తెలుగు గురించి గొప్పగా.. చెప్పేవారు.. తెలుగు ఉనికి గురించి బాధపడేవారు.. కూడా తమ పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్ గా హిందీని సెలక్ట్ చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కనీసం 70 శాతం సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ ఉంది.
భావితరాలకు తెలుగు నేర్పకుండా భాష బతుకుతుందా?
ఇతర ప్రాంతీయ భాషలు ఉన్న రాష్ట్రాల్లో వారి భాషను రెండో లాంగ్వేజ్ గా నేర్చుకోవడం తప్పని సరి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికీ తప్పదు. కానీ తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం ఏమిటంటే.. కనీసం రెండో లాంగ్వేజ్ గా తెలుగు నేర్పరు. తెలుగు భవిష్యత్ పై బాధపడే ఎంతో మంది.. మాట్లాడటం రావడమే తెలుగు భాషకు తాము ఇచ్చే గొప్ప గౌరవం అనుకుంటున్నారు. మాటలతోనే భాష బతికిపోదు. చదవడం, రాయడం కూడా నేర్పించాలి. కానీ ఆ పని చేయడం లేదు. భావితరాలకు భాష రాకపోతే.. ఆ భాష క్రమంగా నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు తెలుగుకు అదే పరిస్థితి ఉంది.
భాషలతో రాజకీయం కాదు.. చిత్తశుద్ధి ఉండాలి !
హిందీని నేర్చుకోవడం అంటే తెలుగును చంపడం కాదు. కానీ తెలుగుకు బదులు హిందీని నేర్పడం మాత్రం ఖచ్చితంగా తెలుగుపై దాడే. అది చేస్తోంది.. తెలుగుపై ఎక్కువగా బాధపడేవారే. ముందుగా సంస్కరణలను తమ ఇంటి నుంచే ప్రారంభించాలి. ఇంగ్లిష్ మీడియంలోనే చదువులు చెప్పాలి.. కానీ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా నిర్బంధంగా నేర్పించాలి. హిందీ మాట్లాడటం వస్తే చాలు.. చదవడం, రాయడం రాకపోయినా ఏం సమస్యా రాదు. ముందుగా .. రాజకీయాల కోసం భాషల విషయంలో తమ వాయిస్ వినిపించి.. రాజకీయంగా ఇష్టం లేని వారిపై నిందలేయడం కన్నా.. ముందు తమ వంతు ప్రయత్నంగా అమ్మభాషను బతికించే ప్రయత్నం చేయాలి.