భారత రాష్ట్ర సమితి కన్నా కవితనే ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్నారు. ఇతరులు విమర్శించినా అది కవితకు మరింత ప్రచారం కల్పిస్తోంది. బీఆర్ఎస్ స్పందనలు మాత్రం పెద్దగా వెలుగులోకి రావడం లేదు. ఈ రాజకీయం తెలంగాణలో ఆసక్తికరంగా మారుతోంది.
కవిత తాను బీఆర్ఎస్ లీడర్నని చెప్పుకుంటున్నారు కానీ జాగృతి పేరుతో సొంత రాజకీయం చేసుకుంటున్నారు. సొంతంగా ప్రజా ఉద్యమాలు చేపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఏకంగా రైల్ రోకుకు పిలుపునిచ్చారు. నిజంగా ఆ రైల్ రోకో జరిగి ఉంటే కవిత బలం బయటపడేది. కానీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబరాలు చేసి వాయిదా వేసుకున్నారు. అయితే ఇతర విషయాల్లో మాత్రం ఏమీ తగ్గడం లేదు. భద్రాచలం రామాలయ భూముల గురించి చంద్రబాబుకు లేఖ రాశారు.
మహిళలకు డబ్బులు ఇస్తామన్న కాంగ్రెస్ హామీపై పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. అందులో స్వయంగా పాల్గొన్నారు కూడా. ధర్నా చౌక్ దగ్గర ఎవరైనా ధర్నాలు చేస్తూంటే వెళ్లి మద్దతు పలుకుతున్నారు. కవితతో పోటీగా రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ విఫలవుతోంది. కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ ను తిట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఏడాదిన్నర అవుతున్నా.. బీఆర్ఎస్ రోడ్డెక్కే ప్రయత్నం చేయడం లేదు. కవిత అందుకే.. బీఆర్ఎస్ కన్నా తానే ఎక్కువ పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు.
కవిత రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ కు అర్థం కావడం లేదు. ఆమె ..కేసీఆర్ కుమార్తె. అటూ ఇటూగా ఒక్క మాట అనలేరు. అందుకే ఎవరూ నోరు విప్పడం లేదు. కేసీఆర్ నుంచి ఓ డైరక్షన్ రావాలి. కేసీఆర్ ఇప్పుడు కవిత విషయంలో అసంతృప్తిగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇది కవితకు మరింత బలం చేకూర్చేలా ఉంది.