కోట శ్రీనివాసరావు వివాదాల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. ఆయన కాంట్రవర్సీ స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది లేదు. కాకపోతే.. ఒకే ఒక్క విషయంలో మాత్రం ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి కొంతమంది నటులకు కోపం తెప్పించారు. అయితే కోట మాటలు, కోట ఆవేశం కూడా ధర్మాగ్రహమే అనిపించేది. పర భాషా నటులకు తెలుగులో పెద్ద పీట వేయడం కోట శ్రీనివాసరావుకు సుతారమూ ఇష్టం ఉండేది కాదు. ఇదే విషయం ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారు.
‘మన దగ్గరకు నటులకు కొరత వచ్చిందా? మన కంటే తోపు నటులు పక్క రాష్ట్రాల్లో ఉన్నారా? వాళ్లని ఎందుకు తెచ్చి నెత్తి మీద పెట్టుకొంటారు’ అంటూ కోట చాలా సందర్భాల్లో సీరియస్ అయ్యేవారు. ‘దమ్ముంటే నానా పటేకర్, ఓ నశీరుద్దీన్ షా.. ఇలాంటి నటుల్ని తీసుకురండి. వాళ్లతో పోటీ పడి నటిస్తాం. తెలుగుని ముక్కలు ముక్కలుగా విరిచేసి ఖూనీ చేసిన వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇస్తారు’ అని డైరెక్ట్‌గానే దర్శక నిర్మాతలపై విరుచుకుపడిపోయేవారు.
ఓ దశలో కోట ప్రభావం తగ్గడానికి పరభాషా నటుల రాక ప్రధాన కారణం. షాయాజీషిండే లాంటి నటులు ఉధృతంగా తెలుగులోకి వచ్చి సినిమాలు చేసేవారు. వాళ్లకు పారితోషికాలు కూడా భారీగానే ఇచ్చేవారు. దీనిపై కోట ఓ పోరాటమే చేశారు. `పరభాషా నటుల్ని బ్యాన్ చేయండి` అని గట్టిగా అడిగేవారు. తెలుగు నుంచి మరో భాషకు వెళ్లి నటిస్తే, గౌరవం ఇవ్వరని, పారితోషికాలూ తక్కువ ఇస్తారని, అలాంటప్పుడు మనమెందుకు మెతగ్గా ఉండాలని నిలదీసేవారు. కోట చెబుతోంది కరెక్టే అని చాలామందికి అనిపించినా, పెద్దగా స్పందించేవాళ్లు కాదు. అందుకే ఈ విషయంలో కోట చాలా మదన పడేవారు. ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చేది. ఎవరూ పెద్దగా స్పందించలేకపోయేసరికి కోటకు కూడా విసుగొచ్చి, తన వాదన కూడా వినిపించడం మానేశారు.
Click Here For: Live : కోట శ్రీనివాసరావు ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం