‘ఈ ఫోనెవడు కనిపెట్టాడ్రా బాబూ..’
ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ మేనరిజం చూడండి. ఓ వైపు నవ్వొస్తుంది. ఓ వైపు భయం వేస్తుంది.
కోట స్టైలే అది. విలనిజంలో కామెడీ మిక్స్ చేస్తాడు. కామెడీలో కొంచెం సెంటిమెంట్ జోడిస్తాడు. నవ్విస్తాడు.. అంతలోపే గుండెల్ని పిండేస్తాడు.
ఎస్వీఆర్ తరవాత కైకాల సత్యనారాయణ ఎలానో..
కైకాల సత్యనారాయణ తరవాత కోట అలా..
ఈ మాటకు తిరుగులేదు. ఇది కోట చరిత్ర చెబుతుంది. కోట చేసిన పాత్రలు చెబుతాయి. కోట వదిలి వెళ్లిన జ్ఞాపకాలు చెబుతాయి.
కొంతమంది ఆర్టిస్టులు దర్శకులకు వరం. నటుడ్ని కెమెరా ముందు నిలబెట్టి, కొన్ని డైలాగులు చెబితే చాలు. ఎలాంటి పాత్ర అయినా లొంగ దీసేసుకొంటారు. ఆ పాత్రలో ఆవహించేస్తారు. ఆ పాత్రలా ప్రవర్తిస్తారు. కోట అచ్చంగా అలాంటి నటుడే.
బాబాయ్, నాన్న, మావయ్య
ఆఫీసరు, గుమస్తా, ప్యూను
సీఎం, మంత్రి, ఎం.ఎల్.ఏ – ఏదైనా సరే – హింట్ ఇస్తే చాలు.. సెంటిమీటర్ చోటు లేకుండా చొరబడిపోతాడు.
కోట ఎత్తుకోవడమే.. విలన్ పాత్రలు, ఆ పాత్రలకు సైడ్ వేషాలు ఎత్తుకొన్నాడు.
నిజానికి ఇలాంటి పాత్రలతో తెరంగేట్రం చేస్తే – ఆ పాత్రలే వస్తాయి. ఆ ముద్రే పడుతుంది. నిజంగా కోట అదే దారిలో వెళ్తే మహా అయితే వంద సినిమాకో, మూడేళ్లకో తెర మరుగు అయ్యేవాడు.
కానీ కోట ఒక్క ఏరియానే నమ్ముకోలేదు. ఆల్ ఏరియాలూ కవర్ చేసేశాడు.
‘అహనా పెళ్లంట’లో పిసినారి కోటని చూశాక మళ్లీ ఆయనకు విలనీ ఇవ్వాలనిపిస్తుందా?
`శత్రువు`లో ఆ కర్కశం కళ్లారా గాంచాక మళ్లీ ఆయనకు సెంటిమెట్ వేషాలు ఇవ్వాలనిపిస్తుందా?
కానీ ఇచ్చారు. పాజిటీవ్, నెగిటీవ్, గ్రే, గ్రీన్, రెడ్.. ఇలా ఏ షేడూ వదల్లేదు.
‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ..’ లాంటి పాటలు పాడి, హుషారైన స్టెప్పులు వేసిన కోట
‘మందుబాబులం… మేం మందు బాబులం’ అంటూ తాగుబోతులకు ఓ జాతీయ గీతం అందించేశాడు.
బాబూ మోహన్‌తో కోట జోడీ ఆల్ టైమ్ సూపర్ హిట్. ‘మామగారు`లో వీరిద్దరూ పండించిన కామెడీ నెవర్ బిఫోర్ అనిపించింది. దాంతో కోట – బాబూ మోహన్ కచ్చితంగా మా సినిమాల్లో ఉండాల్సిందే అంటూ హీరోలు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. కోట ఉంటే బాబూ మోహన్ డేట్లు పట్టాల్సిందే. బాబూ మోహన్ ఉంటే కోట ఉండి తీరాల్సిందే. అలా వీరిద్దరూ వందకు పైగా సినిమాలు చేశారు. హీరో హీరోయిన్ కాంబినేషన్లా.. వీళ్లదీ సూపర్ హిట్ జోడీ అయిపోయింది.
‘హలోబ్రదర్’ కోట కెరీర్లో మరో మెచ్చుతునక. అందులో మల్లిఖార్జున రావుతో కాంబినేషన్. సినిమా అంతా ఇద్దరు కొట్టుకొంటూ, తిట్టుకొంటూ పని చేస్తుంటారు. అదీ ఫన్నీగానే ఉంటుంది. కానీ చివర్లో… మల్లికార్జున్ రావు చనిపోతే.. అక్కడ, ఆ సీన్లో కోట నటన గుండెలు పిండేస్తుంది. సినిమా అంతా వీళ్లు పండించిన కామెడీ మర్చిపోయి, చివర్లో ఆ సెంటిమెంట్ సీన్‌కే కదిలిపోతాడు ప్రేక్షకుడు. అదీ నటన అంటే..!
ఎంత గొప్ప నటుడైనా.. ఏదో ఓ సినిమాలో, ఏదో ఓ పాత్ర తేలిపోతాడు. ‘ఈసారేంట్రా.. ఇలా చేశాడు’ అనిపించుకొంటాడు. కానీ.. కోటలో ఆ రిమార్క్ ఒక్కసారి కూడా లేదు. ఎంత చిన్న వేషమైనా, ఇలా వచ్చి, అలా మాయమైపోయేదైనా తానేంటో, తన ముద్రేంటో చూపించే వెళ్తాడు. నిజంగా ఇది అందరికీ సాధ్యమయ్యే మ్యాజిక్ కాదు.
అందుకే 9 నంది అవార్డులు వచ్చాయి.
ఫిల్మ్ ఫేర్‌లకు లెక్కేలేదు.
ఆఖరికి పద్మశ్రీ కూడా వరించింది.
జీవితంలో అన్నీ చూసేశాడు కోట.
లెక్కలేనంత అభిమానం సంపాదించుకొన్నాడు.
చేయని పాత్రలేదు.. చేతకాని వేషం లేదు.
అందుకే ఇలా.. ఇప్పుడు సైలెంట్ గా నిష్కృమించాడు.
పరిపూర్ణజీవితాన్ని అనుభవించిన కోటకు ఈ నిష్కృమణ కూడా గొప్పగానే ఉంటుంది.
కానీ ఆయన్ని అభిమానించే మనసులు మాత్రం ఈ విషాదాన్ని మెయడం కష్టం.
కోట పాత్రలు కళ్ల ముందు కదులుతున్నప్పుడు
గుండెల నిండా ఎంతో భారం.
తప్పదు.. ఈ భారం మోస్తూనే ఉండాలి.