ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కవిత అనుచరులు దాడి చేశారు. క్యూ న్యూస్ కార్యాలయంలో మల్లన్న ఉన్న విషయం తెలుసుకున్న కవిత అనుచరులు దాదాపుగా యాభై మంది ఆ కార్యాలంపై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి మల్లన్న తప్పించుకున్నారు. ఆయన. గన్‌మెన్‌పై కవిత అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలకు తాళలేక లోపలికి వెళ్లిన గన్‌మెన్ ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.
గాల్లోకి కాల్పులు జరపడంతో పోలీసులు వెంటనే వచ్చారు. పోలీసులు వచ్చేలోపు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడి చేయడానికి తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణం అని దాడి చేయడానికి వచ్చిన వారు నినాదాలు చేశారు. కవిత బీసీ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బీసీ ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ .. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవితకు బీసీలతో సంబంధం ఏమిటని.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అని ప్రశ్నించారు. మంచం పొత్తు అనే మాట అభ్యంతరకరంగా ఉండటంతో కవిత అనుచరులు రగిలిపోయారు.
దాడి సమయంలో కార్యాలయంలోనే ఉన్న మల్లన్న.. కవిత అనుచరుల దాడి నుంచి తప్పించుకోగలిగారు. అయితే కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి చేసిన వారిని వీడియోలలో గుర్తించి అరెస్టు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఓ మహిళా రాజకీయ నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.