కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘోరంగా ఉన్నాయి. ఓ మహిళా నేతను ఉద్దేశించి ఎవరూ చేయకూడనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి విధానం వారిది. ఎవరైనా గీత దాటకుండానే విమర్శలు చేసుకోవాలి. కానీ మల్లన్న మాత్రం అన్ని హద్దులూ దాటిపోయారు.
కవిత బీసీ ఉద్యమం చేస్తున్నారు. అది ఆమె రాజకీయ విధానం. నచ్చకపోతే ఆమెను ప్రశ్నించడానికి ఎవరికైనా ఆవకాశం ఉంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ ప్రశ్నల విషయంలో దిగజారిపోయారు. బీసీలతో “ కంచం పొత్తు ఉందా..? మంచం పొత్తు ఉందా?..” అని ఆమెను ప్రశ్నించారు. బీసీ ఉద్యమంతో కవితకేం సంబంధం అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ మహిళా నేత వ్యక్తిత్వాన్ని అత్యంత ఘోరంగా కించ పరిచినట్లు అయింది. ఈ కారణంగానే కవిత అనుచరులు దాడికి వచ్చారు.
దాడి చేయడం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే అసలు ఇలాంటి వ్యాఖ్యలను మహిళా నేతపై ఎలా చేస్తారన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో కులాల వారిగా ఎంపిక చేసుకుని మరీ బూతుల దాడి చేస్తున్న ఆయన ..కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా నడిచిపోతుదంని అనుకున్నారు. ఇలాంటి వారు గౌరవనీయ పొజిషన్లో ఉన్నా సరే.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో వైసీపీ నేతలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యల తర్వాత.. తెలంగాణలో ఆ పని తీన్మార్ మల్లన్న చేస్తున్నారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలుమార్లు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇప్పుడు మరోసారి దాడికి గురయ్యారు. ఆయన మాటల్ని విన్నవారెవరూ.. దాడిని తప్పు అని సమర్థించనంత ఘోరంగా ఆయన మాట్లాడారు.