యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం. ‘క’ సినిమాతో ఓ మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పుడు ‘కే రాంప్’ ఆడించడానికి వస్తున్నాడు. టైటిల్ ఎంత వెరైటీగా ఉందో.. ఈ రోజు విడుదల చేసిన టీజర్ అంత వెరైటీగా వుంది. కొన్ని బూతులు… బీప్‌లు లేకుండా యదేచ్ఛగా వచ్చేసినా – అవన్నీ ఫ్లోలో కలిసిపోయేవే… కుర్రకారుకి కిర్రెక్కించేవే. ముఖ్యంగా కిరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ విభిన్నంగా ఉన్నాయి. తనలో ఈ డైమెన్షన్ ఎవరూ ఊహించలేనిది. స్క్రీన్ పై కూడా చూడ్డానికి బాగున్నాడు. కొన్ని షాట్లు, విజువల్స్.. ఇవన్నీ యూత్ ని థియేటర్లకు రప్పించేలా ఉన్నాయి. మాస్ పల్స్‌ని సరిగ్గా అర్థం చేసుకొని కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేశారనిపిస్తోంది. మలయాళం సినిమాలపై, మన సినిమాలపై ఇచ్చే రివ్యూలపై కిరణ్ గట్టిగానే సెటైర్లు వేసినట్టు అర్థం అవుతోంది. కథేమిటన్నది రివీల్ చేయకపోయినా.. క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ తో చెప్పేశారు. సినిమా మొత్తం ఇదే జోష్ కంటిన్యూ అయితే టాలీవుడ్ ని మరో యూత్ ఫుల్ సినిమా ఊపేయ్యడం ఖాయం.
హీరోలు కొత్త డైమెన్షన్లు వెదుక్కొంటూ ముందుకు వెళ్తే.. పాత కథలే కొత్తగా కనిపిస్తుంటాయి. ‘కే రాంప్’ తో కిరణ్ అదే చేశాడనిపిస్తోంది. రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాని అక్టోబరు 18న విడుదల చేస్తున్నారు. ‘కే రాంప్’ తో పాటుగా ‘చెన్నై లవ్ స్టోరీస్’ అనే ఓ సినిమా చేస్తున్నాడు కిరణ్. అందులో పూర్తిగా క్లాస్ టచ్ ఉన్న పాత్ర. మొత్తానికి ఒకేసారి రెండు విభిన్నమైన కథలు, పాత్రలతో కిరణ్ ముస్తాబవుతున్నాడు. కాకపోతే రెండూ యూత్ ఫుల్ సినిమాలే.