పొత్తులు ఉన్నప్పుడు రాజకీయాలన్నీ ఒక వైపే ఉండవు. కొన్ని వదులుకోవాలి.. కొన్ని తీసుకోవాలి.. మరి కొన్ని సాధించుకోవాలి. అన్నీ పొత్తులో ఉండే ఈక్వేషన్స్ ఆధారంగానే సాగాలి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మాస్టర్స్ డిగ్రీ ఉందని అనుకోవచ్చు. దానికి సాక్ష్యమే….సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి.
భారతీయ జనతా పార్టీ సాధారణంగా గవర్నర్ లాంటి పదవులు ఇతర పార్టీలకు చెందిన వారికి ఇవ్వదు. అధికారంలోకి వచ్చిన పదకొండేళ్ల కాలంలో ఎంతో మంది గవర్నర్లను నియమించారు. అందులో తమ పార్టీ నేతలు ఉన్నారు. తమ పార్టీ సానుభూతిపరులైన తటస్థులు ఉన్నారు.. తమ భావజాలంతో ఉండే తటస్థుల్ని కూడా నియమించారు. కానీ ఇతర పార్టీలతో చిన్న అనుబంధం ఉందని భావించిన ఎవరికీ పదవి ఇవ్వలేదు. మోత్కుపల్లి నర్సింహులు కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కానీ ఇప్పుడు అశోక్ గజపతిరాజు అంశంలో మాత్రం సక్సెస్ అయ్యారు.
చంద్రబాబు కూటమిగా బీజేపీని చేర్చుకున్న తర్వాత…. ఆ పార్టీకి బలం లేకపోయినా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లను కూడా కేటాయించారు. కానీ ప్రతి దానికి ఓ లెక్క ఉంటుంది. బీజేపీకి ఎంత ఇస్తున్నారో.. అంత మేర సహకారాన్ని పొందుతున్నారు. గవర్నర్ పదవుల్లాంటివీ పొందుతున్నారు. ఇంకా ఎంతో మందికి కేంద్రంలోనూ పదవులు రావాల్సి ఉంది. వస్తాయి కూడా. సీనియర్ నేతలకు ఎలాంటి సముచిత గౌరవం ఇవ్వాలో చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దానికి తగ్గట్లుగా పరిస్థితులు వచ్చినప్పుడు అవకాశాలు కల్పించడమే ఆయన తర్వాత ప్రణాళిక అనుకోవచ్చు.
జనసేన పార్టీ అయినా.. టీడీపీ అయినా.. బీజేపీ అయినా… కొన్ని తీసుకుంటే.. కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఈ విషయంలో వారు తమకు లభించిన, లభిస్తున్న అవకాశాల పట్ల కాస్త స్పష్టతతో ఉండాల్సిందే. పని లేని వారు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకోవచ్చు కానీ కూటమి మధ్య కెమిస్ట్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది. అది రాజకీయాలను పూర్తి స్థాయిలో మార్చేస్తోంది.