సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు ..కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ సోషల్ మీడియా సైన్యాలు ఈ విషయంలో ఎప్పుడో హద్దులుదాటిపోయాయి. వారికి చట్టపరమైన భయం లేకపవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
స్వీయ నియంత్రణ బెటరన్న సుప్రీంకోర్టు
ఈ అంశంపై సెన్సార్ షిప్ ఉండాలన్న పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే సెన్సార్ షిప్ కన్నా.. స్వీయ నియంత్రణ పాటించడమే మేలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడుతోంది. అయితే చట్టపరమైన భయం లేనప్పుడు.. ఈ స్వీయ నియంత్రణ అనేది రాజకీయ పార్టీల సైన్యాలకు అసలు ఉండదు. అక్కడే ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోంది. సోషల్ మీడియా ఆనకొండ కంటే డేంజర్. వాటి బారిన పడని వారు ఇప్పటి వరకూ లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు. అయితే వ్యక్తిగత వినియోగం దారి తప్పినప్పుడు దాని దుష్ఫలితాలు అనుభవించినప్పుడు స్వీయనియంత్రణ ఎంత అవసరమో సోషల్ మీడియా వినియోగదారుకు తెలుస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇతరులకు ఆయుధం అయినప్పుడే అసలు సమస్య వస్తోంది .
సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననాలు
రాజకీయ పార్టీల రాజకీయం మారిపోయింది. నడమంత్రపు రాజకీయ నేతలు, క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నవారు.. చదువు మాత్రమే నేర్చుకుని సంస్కారం నేర్చుకోని నేతలు పార్టీల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. తమ ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా .. నాశనం చేయాలంటే… వారి కుటుంబాలను ఇంట్లోని ఆడవాళ్లను టార్గెట్ చేసుకోవాలనుకుంటున్నారు. వారి వ్యక్తిత్వాలను హననం చేస్తున్నారు. వారు చేస్తున్నారని.. ఇతరులు ప్రారంభిస్తున్నారు. ఫలితంగా అది వైరస్ గా పాకిపోతోంది. చట్టపరమైన భయం కల్పిస్తే.. ఎవరూ ముందడుగు వేయరు. అలాంటి భయం లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి.
హైకోర్టు జడ్జిలనూ బెదిరించేంతటి స్వేచ్ఛ ఎలా ?
సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు టూల్ గా ఉపయోగించుకుని కొంత మంది వ్యక్తుల్ని నియమించుకుని.. సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నారు. గతంలో ఏపీలో న్యాయమూర్తిల్ని నరికేస్తామని పోస్టులు పెట్టారు…కాదు పెట్టించారు. వ్యవస్థీకృతమైన వ్యవస్థ ద్వారా ఈ దాడి చేశారు. సీబీఐ విచారణ జరిగినా మధ్యలో ఆగిపోయింది. ఆ విచారణ పూర్తి అయి ఉంటే.. సోషల్ మీడియా ఎంత వికారంగా మారిందో.. అసాంఘిక శక్తుల చేతిలో ఆయుధంగా ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు స్వేచ్ఛను దుర్వినియోగం చేసి.. రాజకీయ ప్రయోజనాలు సాధించాలని అనుకుంటారు. వీరికి అడ్డుకట్టపడాలంటే.. ఖచ్చితంగా ఓ చట్టభయం ఉండాలి.
ఓ టీవీ చానల్ పెట్టాలంటే… ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఓ యూట్యూబ్ చానల్ పెట్టాలంటే.. జీమెయిల్ ఖాతా క్రియేట్ చేస్తే చాలు. ఏదైనా ప్రసారం చేయవచ్చు. ఏదైనా పోస్టు చేయవచ్చు. అందుకే ….ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా.. తమ వాక్ స్వేచ్చను వాడుకునేలా.. చట్టభయం ఉండాలి. అప్పుడే సోషల్ మీడియాలో స్వీయనియంత్రణ గురించి వ్యక్తులు ఆలోచిస్తారు.