వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఫ్యాన్ గుర్తు. కానీ దాన్ని మార్చి గొడ్డలి గుర్తు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్లింది. సాధారణంగా ఇతర రాజకీయ పార్టీలు.. వైసీపీ తమ పార్టీకి గుర్తుగా గొడ్డలిని తెచ్చుకోవాలని ఎగతాళి చేస్తూంటాయి. దానికి కారణం ఆ పార్టీకి ఉన్న నేర చరిత్ర. కానీ ఇప్పుడు నిజంగానే గొడ్డలి గుర్తు కావాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడి నుంచి ఎన్నికల సంఘానికి లేఖ వెళ్లింది. ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
వైఎస్ఆర్సీపీ అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని జగన్ ప్రారంభించలేదు. శివకుమార్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఆయన వద్ద నుంచి జగన్ లాక్కున్నారు. శివకుమార్ కు ఏదో ఓ చిన్న పదవులు ఇచ్చారు. తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి శివకుమార్ జగన్ పై తన బాణాలు విసరడం ప్రారంభించారు. తన పార్టీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని వ్యవస్థాపకుడి హోదాలో ఈసీకి లేఖ రాశారు.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజకీయ పార్టీలకూ కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని వైసీపీ ఎప్పుడూ పాటించలేదు. శివకుమార్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత తూతూ మంత్రంగా అంతర్గత ఎన్నికలు నిర్వహించేవారు. తర్వాత అవి కూడా మానేసి.. తనను శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారు. కానీ ఎన్నికల సంఘం అది చెల్లదని స్పష్టం చేసింది. అయినా మళ్లీ పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించలేదు.
వ్యవస్థాపకుడిగా శివకుమార్ కు ఆ పార్టీపై ఏమైనా అధికారం ఉందో లేదో తెలియదు. ఆ పార్టీ లో సంస్థాగతంగా ఎన్నికలు జరగడం లేదు కాబట్టి శివకుమార్ తనను క్లెయిమ్ చేసుకుని గొడ్డలి గుర్తు కోసం దరఖాస్తు చేశారు. నిజంగా ఈ లేఖను ఈసీ పరిగణనలోకి తీసుకుంటే.. వైసీపీ గుర్తు మారిపోతుంది.