రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ రావాలంటే ఆ ఏరియాకు లేదా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ బలంగా ఉండాలి. అందుకే చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రపోజ్డ్ మెట్రో.. ప్రపోజ్డ్ రింగ్ రోడ్ అని పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇలాంటి ప్లస్ పాయింట్ ఎయిర్ పోర్టుల వద్ద కనిపిస్తోంది.
ఎయిర్‌పోర్టుల సమీపంలో ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి ట్రెండ్ల ప్రకారం, భారతదేశంలోని పలు నగరాల్లో విమానాశ్రయాల సమీపంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. నవీ ముంబై, నోయిడా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో విమానాశ్రయాల దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఆస్తుల ధరలు 2021 నుంచి 2025 వరకు 70-120 శాతం పెరిగినట్లుగా అంచనాలు వెలుగులోకి వచ్చాయి.
విమానాశ్రయాల సమీపంలో వాణిజ్య కేంద్రాలు, ఐటీ హబ్‌లు, లాజిస్టిక్ సంస్థలు ఏర్పాటవుతున్నాయి, ఇవి గృహ డిమాండ్‌ను పెంచుతున్నాయి. రోడ్లు, మెట్రో, ఇతర సౌకర్యాల అభివృద్ధి విమానాశ్రయ ప్రాంతాలను ఆకర్షణీయంగా మారుస్తోంది. నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ దక్షిణం, బెంగళూరు ఉత్తరం వంటి ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుకు సామీప్యత కారణంగా ధరలు పెరుగుతున్నట్లుగా గుర్తించారు.
విమానాశ్రయ సమీప ప్రాంతాల్లో ఆస్తుల ధరలు నగర సగటు 48 శాతంతో పోలిస్తే 74శాతం పెరిగినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. ఇటీవలి కాలంలో విమానప్రయాణాలు మధ్యతరగతికీ అందుబాటులోకి వస్తున్నాయి. రాబోయే ఎయిర్ పోర్టుల చుట్టూ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడతాయని అంచనా. అందుకే .. ముందు ముందు… ఎయిర్ పోర్టుల వద్ద రియల్ ఎస్టేట్ డిమాండ్ భారీగా పెరగనుంది.