టెలివిజన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు సినిమాల్లో అడుగుపెడుతున్నారు. అయితే వారి సినిమాకి థియేటర్ ప్రేక్షకుల స్పందన పేలవంగా ఉంటుంది. టీవీలో అభిమానులను సంపాదించుకున్నా, ఆ అభిమానం బిగ్ స్క్రీన్‌కి మాత్రం మారటం లేదు.
‘మొగలిరేకులు’తో తెలుగు వారందరికీ పరిచయమైన ఆర్కే సాగర్… హీరోగా నిలబడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక్క బ్రేక్ రావడం లేదు. రీసెంట్గా వచ్చిన ‘ది 100’ సినిమాకీ ఆదరణ లేదు. పోనీ ఎలాంటి ప్రచారం లేకుండా రిలీజ్ చేశారా అంటే అదీ కాదు. వెంకయ్య నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకూ చాలా మంది ప్రముఖులు సినిమా గురించి మాట్లాడారు. కానీ సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సాగరే కాదు… టీవీలో పాపులరైన యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, ధనరాజ్, గెటప్ శ్రీను, శంకర్… ఇలా ఎంతో మంది వెండితెరపైకి వచ్చారు. కానీ ఎవరికీ బ్రేక్ రాలేదు. నటులు, నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ విజయం మాత్రం దక్కడం లేదు.
టీవీలో వచ్చిన క్రేజ్‌ను సినిమాలకు ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన కథ, కంటెంట్, డైరెక్టర్ని ఎంచుకోవడంలో లోపాలు కనిపిస్తున్నాయి. టీవీలో సంపాదించుకున్న క్రేజ్ వెండితెరపై ఎంత మాత్రం ప్రభావం చూపడం లేదు. టీవీలో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథను ఓకే చేసుకోవడం ఇక్కడ ప్రధాన లోపం. రొటీన్ కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలి. టెలివిజన్ ఇమేజ్ను బ్రేక్ చేసే క్యారెక్టర్స్ ఎంచుకోవాలి. కానీ అలా జరగడం లేదు.
టీవీ నుంచి సినిమాలకి మారి అక్కడ నిలబడటం ఈజీ కాదు. కానీ ఇలా టీవీ నుంచి వచ్చిన స్టార్స్ అయిన నటులు చాలా మంది ఉన్నారు. ‘కేజీఎఫ్’ యశ్ సీరియల్ నటుడే. శుషాంత్ సింగ్ రాజ్‌పుత్ టీవీ నుంచే వచ్చాడు. ఇంకా వెనక్కి వెళితే షారుఖ్ ఖాన్ జర్నీ కూడా టీవీ నుంచే ప్రారంభమైంది. కానీ ఇప్పుడలా టీవీ నుంచి నిలబడిన నటులే కరువయ్యారు.
ప్రస్తుత కాలంలో థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం మైన్‌స్ట్రీమ్ హీరోలకే ఒక ఛాలెంజ్‌గా మారింది. ఇలాంటి పరిస్థితిలో నిత్యం టీవీల్లో కనిపించే నటులకి ఇది మరింత ఛాలెంజ్. ఎలాగైనా హీరోగా చేయాలనే పట్టుదల కాకుండా, కథ, పాత్ర బలంగా ఉందా అనేది చూసుకోవాలి. అలాగే డైరెక్టర్లు, నిర్మాతలు కూడా టీవీ క్రేజ్‌ను ఆసరాగా తీసుకొని సినిమాలు తీయడం మానాలి.
టీవీ స్టార్ నుంచి సినిమా స్టార్ గా మారడం అంత తేలిక కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కంటెంట్, థియేట్రికల్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకొచ్చే బ్యాక్‌డ్రాప్‌లతో సినిమాలు చేయగలిగితేనే టీవీ నటులు బిగ్ స్క్రీన్‌పై మనుగడ సాధించగలరు.