చిట్ చాట్ పేరుతో రేవంత్ రెడ్డి తనపై డ్రగ్స్ అడిక్ట్ ముద్రవేస్తున్నాడని ఆయనను కోర్టుకు లాగుతానని కేటీఆర్ ప్రకటించారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు తనపై డ్రగ్స్ కేసులున్నాయా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కేటీఆర్ డ్రగ్స్ వాడుతుంటారని.. తాను వైట్ చాలెంజ్ చేస్తే పారిపోయాడని.. మాట్లాడకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారని అన్నారు. అలాంటి వారి విమర్శలకు తాను స్పందించబోనన్నారు. దీనిపై కేటీఆర్ ఎక్స్ లో న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
ఈ చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మరికొన్ని అంశాలపై స్పందించారు. లోకేష్ తో కేటీఆర్ అర్థరాత్రి డిన్నర్ భేటీ నిర్వహించారని ఆరోపించారు. ఆ డిన్నర్ భేటీ ఎందుకో చెప్పాలన్నారు. దీన్ని కేటీఆర్ ఖండించలేదు. అసలు స్పందించలేదు. ఇదే మొదటి సారి కాదు. గతంలో సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినప్పుడు కూడా స్పందించలేదు. కేటీఆరే కాదు.. బీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. దీంతో నిజంగానే భేటీ జరిగిందన్న అభిప్రాయానికి సామాన్య జనం వస్తున్నారు.
రాజకీయాల్లో ఇలాంటి భేటీలు జరగకపోతే పార్టీలు వెంటనే ఖండిస్తాయి. లేకపోతే రకరకాల ప్రచారాలు జరుగుతాయి. ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం టీడీపీకి లేదు. వైసీపీకి దగ్గరగా ఉండే బీఆర్ఎస్ నేతలు టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరగడం టీడీపీ క్యాడర్ కు బాగానే ఉంటుంది. మౌనం అర్థాంగీకారం అని.. అందరూ కేటీఆర్, లోకేష్ భేటీని కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్, బీఆర్ఎస్ ఈ ప్రచారంపై క్లారిటీ ఇస్తే బెటరన్న అభిప్రాయం వినిపిస్తోంది.