బీహార్‌లో 125 యూనిట్ల విద్యుత్ వరకూ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. అంతేనా..మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. ఇదంతా రాబోతున్న ఎన్నికల కోసమే. నవంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తీవ్రమైన అధికార వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో నితీష్ కుమార్ పదవిని నిలబెట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాయిలాలు ప్రకటిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో రెడీ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పేరుకు సీఎం నితీష్ కుమార్ అయినా ఆయన పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ నితీష్ తన రాజకీయ చాణక్యంతో సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఆర్జేడీ..లేకపోతే బీజేపీ అన్నట్లుగా ఎవరు సీఎం పదవి ఇస్తారో వారితోనే జత కడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు.
లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. నిలకడైన రాజకీయాలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో సమన్వయం చేసుకుంటున్నారు. ముస్లింల మద్దతు ఉంటుంది. అందుకే ప్లాన్డ్ గా చేసుకుంటున్నారు. కానీ నితీష్‌కు.. ఈ విజయం చాలా అవసరం. బీజేపీ కూటమి కంటే నితీష్‌కు విజయం అవసరం. రాను రాను ఆయన పార్టీ సైజ్ తగ్గిపోతోంది. ఈ సారి తేడా వస్తే.. ఆ ప్లేస్ మొత్తాన్ని బీజేపీ ఆక్రమించేస్తుంది. అందుకే.. పోటీపడి మరీ ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చే తాయిలాలు వల్ల లాభం కలిగిన ఉదాహరణలు భారత ప్రజాస్వామ్యంలో లేవు. మరి బీహార్‌లో ఏం జరుగుతుందో ?