రాయలసీమకు బనకచర్ల గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టుపై ఏపీలో ఇతర పార్టీల రాజకీయ నేతలు వ్యతిరేకత చూపిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. జగన్ రెడ్డితో పాటు షర్మిల, కమ్యూనిస్టు పార్టీ నేతలు అందరూ అదే అంటున్నారు. అదే సమయంలో రాయలసీమ నుంచి ఈ ప్రాజెక్టు అవసరమని ఒక్క మేధావి ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక మద్దతు ఎలా లభిస్తుంది ?
బనకచర్లకు జగన్ వ్యతిరేకం
నెల రోజుల ముందు ప్రెస్మీట్లో మాట్లాడినప్పుడు బకనచర్ల కట్టాల్సిందేనని జగన్ అన్నారు. గోదావరి మిగులు జలాల ఆధారంగానే ఆ ప్రాజెక్టు కడుతున్నారని అన్నారు.అయితే నెల రోజుల్లోనే ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయి కాబట్టి ఇక వరద కిందకు రాదు కాబట్టి ప్రాజెక్టు కట్టడం దండగ అనేశారు. ఆయన ఎందుకు నాలుక మడతేశారో ఆయనకే తెలియాలి. కానీ రాయలీసమకు నీటి అవసరాలు తీర్చే పెద్ద ప్రాజెక్టును వ్యతిరేకించారన్నది నిజం. ఆయన వ్యతిరేకత తెలంగాణలో చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఉంది.
కాంగ్రెస్, కమ్యూనిస్టులదీ అదే వాదన
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్కక్షురాలు షర్మిల అదే వాదన వినిపిస్తున్నారు. బనకచర్ల కోసం .. పోలవరానికి బొక్క పెడుతున్నారని అంటున్నారు. మేఘా కృష్ణారెడ్డికి మాత్రమే ఉపయోగపడుతుందని అవినీతి కోసమే బనకచర్ల అంటున్నారు. కమ్యూనిస్టులూ అదే అంటున్నారు. అసలు ప్రాజెక్టు ఇంకా మొదటి అడుగులు పడలేదు. టెండర్ల దాకా రాలేదు. కానీ ఆ ప్రాజెక్టు అప్పుడే మేఘాకు వెళ్తుందని… ఇదంతా అవినీతి కోసమేనని ఆరోపించడం ప్రారంభించారు.
అందరూ వ్యతిరేకిస్తే ప్రభుత్వం మాత్రం పట్టుదలకు పోతుందా ?
బనకచర్ల అనే ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. సముద్రంలోకి ప్రతి ఏడాది వేల టీఎంసీల గోదావరి నీరు వెళ్లి కలిసిపోతుంది. అందులో ఓ వందో.. రెండు వందలో టీఎంసీలు వాడుకుంటే.. రాయలసీమ కరువు తీరిపోతుంది. కానీ గోదావరి నీరు అక్కడకు తరలించాలంటే ఎత్తిపోసుకోవడమే మార్గం. దానికి బనకచర్ల తప్ప మరో మార్గం లేదు. కృష్ణాలో నీటి లభ్యత తగ్గిపోతోంది. ఇప్పుడు ఎత్తి పోసుకునే అంశంపైనే అనేక రాజకీయాలు నడుస్తున్నాయి. సముద్రంలోకి పోయే నీటిని మళ్లించుకంటామంటే తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పుడు ఏపీలోనూ వ్యతిరేకించడం.. ఏమిటో వారికే తెలియాలి. ఇది ఏపీకి..సీమకు మంచిదేనా ?