క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తీస్తున్న “ది ఓడిస్సీ” సినిమా చుట్టూ ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవల్. సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాది కాలం ఉంది. కానీ అప్పుడే సినిమా హౌస్ ఫుల్ అయ్యింది.
2026 జూలై 17–19 వీకెండ్లో ప్రదర్శించబోయే IMAX 70mm స్క్రీనింగ్స్ టికెట్లు గత అర్థరాత్రి అమ్మకానికి పెట్టారు. ఒక్క గంటలోపే టికెట్లు అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ ప్రీ-సేల్ వల్ల సుమారు $1.5 మిలియన్ వసూళ్లు వచ్చాయని రిపోర్టులు చెబుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టికెట్ ధర $25–28 ఉండగా, రీసేలర్స్ ఆ టికెట్లని $300–$500 మధ్య అమ్మేస్తున్నారు.
అమెరికాలోని AMC లింకన్ స్క్వేర్, AMC యూనివర్సల్, రిగల్ ఇర్విన్ స్పెక్ట్రమ్, సాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్ ఇతర నగరాలతో పాటు కెనడాలోని మిస్సిస్సాగా స్క్వేర్, వాన్, యూకేలో లండన్ IMAX, సైన్స్ మ్యూజియం, ఆస్ట్రేలియాలో ప్రధాన థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. గంటలో టికెట్లు అయిపోవడంతో తమకు అవకాశం రాలేదని, రీసేల్‌లో 400% పెంచి అమ్ముతున్నారని ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఇంకో సేల్ వస్తుందనే సమాచారం ఉంది.
“ది ఓడిస్సీ”ని హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసానికి ఆధారంగా తీస్తున్నారు నోలన్. మట్ డేమన్, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ లాంటి భారీ తారాగణం ఉంది. పూర్తిగా IMAX కెమెరాలతోనే షూట్ చేస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. ఇంకా షూటింగ్ జరుగుతోంది. $250 మిలియన్ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడున్న క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా లాభాల బాట పట్టడం పెద్ద విషయం కాదు.