సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్టు భయంతో ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతానికి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన కోసం సీఐడీ అధికారులు వెదుకుతున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినందున ఆయన దేశం దాటిపోయే అవకాశం లేదు. అదే సమయంలో ఆయనకు మోర ఆప్షన్ లేదు. పోలీసులకు దొరికిపోవడం అనే ఒకే ఒక్క ఆప్షన్ మాత్రమే ఆయన ఎదుట ఉంది. కానీ ఆయన ఎందుకు సంకోచిస్తున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.
గతంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇలాగే అన్ని రకాల న్యాయపోరాటాలు చేసి విఫలమైన తర్వాత కూడా దొరకలేదు. చివరికి ఆయన కోసం వెదికి వెదికి కేరళలో అరెస్టు చేశారు. పారిపోయిన వ్యక్తిని పట్టుకుని రావడం కన్నా గౌరవంగా లొంగిపోతే బాగుంటుందన్న సలహాలు మిథున్ రెడ్డికి నిరంజన్ రెడ్డి లాంటి న్యాయనిపుణులు ఇవ్వలేదేమో కానీ ఆయన మాత్రం ఆజ్ఞాతం నుంచి బయటకు రాలేదు.
లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో ఒక్క సారి మాత్రం సిట్ ముందు హాజరయ్యారు. తర్వాత న్యాయపోరాటం పేరుతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని పోలీసులు పట్టుకుంటే.. తర్వాత అసలు సూత్రధారి వద్దకు కేసు చేరుకునే అవకాశం ఉంది.