అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కోసం టాటా గ్రూప్ రూ.500 కోట్లతో ప్రత్యేకమైన ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఆ బాధితులకు ఇప్పటికే చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇచ్చింది. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తోంది. అయినా సరే ఆ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఇంకా ఏమైనా చేయాలా అని ఆలోచించి ఐదు వందల కోట్ల రూపాయలతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది.
దీర్ఘకాలంలో ఆయా కుటుంబాల ఆరోగ్య, సంక్షేమాన్ని చూసేందుకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఆ కుటుంబాల్లో పిల్లల చదువులు, అనారోగ్యాలు, ఆస్పత్రి ఖర్చులు సహా ఇతర విషయాల్లో వారి బాగోగులు చూసుకునేందుకు ఈ మొత్తం వచ్చిస్తారు. ఈ ట్రస్ట్ నిర్వహణకు ఐదుగురు సభ్యులతో బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు. విమాన ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. అయితే ఇంజన్లకు హఠాత్తుగా ఇంధనం ఆగిపోవడమే కారణంగా ప్రాథమికంగా తేల్చారు. అది ఎలా జరిగిందనేది తుది నివేదికలో తేలనుంది.
టాటా గ్రూపు వ్యాపార విలువలను పాటించడంలోనే కాదు. .సామాజిక బాధ్యత విషయంలోనూ తనదైన ముద్ర వేసింది. గతంలో ముంబై దాడుల సమయంలో తాజ్ హోటల్ లో జరిగిన విధ్వంసం సమయంలోనూ సిబ్బందికి అండగా ఉన్నారు. తమ విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన కుటుంబాల బాగోగులు సుదీర్ఘ కాలం చూసేందుకు ఇప్పుడు ముందుకొచ్చారు.