పన్నులు బాదేసి వేరే దేశాలను శిక్షిస్తున్నానని అనుకుంటున్న ట్రంప్.. అమెరికాకు చదువుకునే వారిని రాకుండా ఆపేయడం ద్వారా తమ యూనివర్శిటీలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. తమ దేశానికి వచ్చే విద్యార్థులను యూరప్ దేశాలకు పంపేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు అమెరికా యూనివర్శిటీలు దివాలా తప్పదన్నట్లుగా సంక్షోభంలో పడుతున్నాయి.
భారీగా ఆదాయం కోల్పోతున్న అమెరికా వర్శిటీలు
ఒక్క భారత్ మాత్రమే కాదు చైనా సహా అన్ని దేశాల నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. పేరు నోరు తిరగకపోయినా వీసా రిజెక్ట్ చేస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 80 శాతం తగ్గిపోయింది. ఫలితంగా ఆయా వర్శిటీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫీజుల రూపంలో వచ్చే డబ్బు. విదేశీ విద్యార్థులు సాధారణంగా అమెరికన్ విద్యార్థుల కంటే ఎక్కువ ట్యూషన్ ఫీజు చెల్లిస్తారు, ఇది యూనివర్శిటీలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరంలో, విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు 43.8 బిలియన్ డాలర్లు సమకూర్చారు. ఈ సారి ఇందులో సగం కూడా వచ్చే అవకాశాలు లేవు.
విదేశీ విద్యార్థుల మీదే ఎక్కువగా ఆధారపడుతున్న యూనివర్శిటీలు
వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం, చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, భారత విద్యార్థులకు పరిమితంగా అవకాశాలు కల్పించడం, హార్వర్డ్ వంటి యూనివర్శిటీలపై విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై నిషేధం విధించడం వల్ల ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. హార్వర్డ్ యూనివర్శిటీలో 2024-25లో 2 శాతం విదేశీ విద్యార్థులు ఉన్నారు, వీరు యూనివర్శిటీ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని సమకూరుస్తారు. న్యూయార్క్ యూనివర్శిటీ లో 27,000 విదేశీ విద్యార్థులు ఉంటారు. అలాగే కొలంబియా, నార్తీస్టర్న్ వంటి యూనివర్శిటీలు విదేశీ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడతాయి. వీసా పరిమితుల వల్ల ఈ యూనివర్శిటీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.
యూరప్ వైపు వెళ్తున్న విద్యార్థులు
విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా చైనా ,భారతదేశం నుండి వచ్చే వారు STEM రంగాలకు అత్యంత కీలకం. అమెరికా యూనివర్శిటీలలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు కీలకంగా ఉంటారు. వీసా ఆంక్షల వల్ల అమెరికా యూనివర్శిటీలు AI, సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలలో ప్రతిభను కోల్పోతున్నాయి. ఇది అమెరికా టెక్నాలజీ ఆధిపత్యాన్ని బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . విదేశీ విద్యార్థులు యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. యూరప్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.