మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనాలంటే చాలా చూస్తారు. వారికి చాలా సందేహాలు వస్తాయి. ఆఫీసుకు దగ్గరగా తీసుకుందామా, దూరంగా తీసుకుంటే రేట్లు తక్కువకు వస్తాయా..?, డిమాండ్ పెరిగే చోట తీసుకుంటే రేట్లు కూడా పెరుగుతాయి కదా ..? లేకపోతే మంచి సౌకర్యాలు ఉన్న లొకాలిటీని చూసి కొనుక్కోవాలా అని తికమకపడుతూంటారు.
ఆఫీసుకు దగ్గరయితే రేటు చాలా ఎక్కువ
ఆఫీసుకు దగ్గరగా ఉండే ఇళ్లు ఎవరికైనా సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. ఇది అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడంలేదు. మఆఫీసుకు దగ్గరగా ఉండే ప్రాంతం ఎంచుకోవడం వల్ల రోజువారీ ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయి. కానీ ఆఫీసులకు దగ్గర అంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందిన ప్రాంతం.. కమర్షియల్ విలువలు పెరిగిన ప్రాంతం అయితే ఇళ్లు తక్కువ ధరకు రావు. ఐటీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇతర రంగాల వారు తమ కార్యాలయాల దగ్గర ఇల్లు తీసుకోవడం ఉత్తమం. ఐటీ కారిడార్‌లో తప్ప ఇతర చోట్ల అయితే దగ్గరలోనే ఇళ్లు తక్కువ వరకే లభిస్తాయి
సౌకర్యాలు బాగుండే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలా ?
ఆధునిక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, 24/7 సెక్యూరిటీ, పార్కింగ్, క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాలను అందిస్తాయి, ఇవి జీవన ప్రమాణాలను పెంచుతాయి. కానీ ఆదాయ వనరులను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన ఉంటుంది. ఇవి సాధారణంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. రూపాయి రూపాయి కూడబెట్టుకునేవారు హై రైజ్‌లో కొనడం కష్టమే.
భవిష్యత్‌లో రేట్లు పెరిగే అవకాశం ఉన్న చోట కొనొచ్చా ?
ఇల్లు అంటే మధ్యతరగతికి ఇప్పుడు కేవలం తాము ఉండటానికి ఓ గూడు కాదు.. అది భవిష్యత్ కు భద్రత కూడా. అందుకే కాస్త దూరమైనా భవిష్యత్ లో రేట్లు పెరిగే వాటినే ఎక్కువగా కొనాలని చూస్తారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 5 సంవత్సరాలలో 7-10% సంవత్సరానికి క్యాపిటల్ అప్రిసియేషన్ చూపించింది. IT హబ్‌లు, మెట్రో విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఉన్న ప్రాంతాలు భవిష్యత్‌లో ధరలు పెరగడానికి అవకాశం ఉంది. పదేళ్లు లేదా పదిహేనేళ్ల తర్వాత ఎలా ఉంటుంది .. ఎంత రేటు ఉంటుంది అన్నది ఆలోచించుకుని ఎక్కువ మంది ఈ ఫార్ములాకే ఓటేస్తున్నారు. అందుకే హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది.
మీ బడ్జెట్ ఆధారంగా ప్రాంతం ఎంచుకోవాలి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కొంపల్లి, ఉప్పల్, మణికొండ వంటి ప్రాంతాలకు విస్తరిస్తుంది, ఇది ధరలను మరింత పెంచుతుంది. అదే సిటీలో అయితే.. ధరలు శివారులో పెరిగినంతగా పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడహై రేంజ్ కు చేరుకుని ఉంటాయి.