బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన ఫోన్ గతంలో ట్యాపింగ్ జాబితాలో ఉందని వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు పిలిచారు. కానీ ఆయన స్పందించడం లేదు. సిట్ విచారణకు వెళ్లి తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్యాపింగ్ చేయించిన పార్టీలోనే ఉన్నారు. అలాగని తన ఫోన్ ట్యాప్ చేయలేదని కూడా చెప్పలేరు. ఎందుకంటే బీఎస్పీ చీఫ్ గా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆయనే స్వయంగా ఆరోపించారు కూడా.
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురయినా వారి వాంగ్మూలాలను సిట్ తీసుకుంటోంది. అందరూ హాజరై.. తమ ఫోన్ ట్యాప్ అయిందని వాంగ్మాలాలిస్తున్నారు. ఆరా మస్తాన్ లాంటి వాళ్లు హాజరు కావడానికి తటపటాయించి చివరికి .. తమకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చి ఎంత ఘోరంగా ట్యాప్ చేశారో.. తన కుటుంబసభ్యులతో మాట్లాడుకున్నవి కూడా విన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆవేదన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూ ఉంటుంది. కానీ బహిర్గత పర్చలేని పరిస్థితి.
ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్. కొంత కాలం పోలీస్ సర్వీస్ చేసినా.. తర్వాత పూర్తిగా హాస్టళ్ల నిర్వహణ చూసుకునే డిపార్టుమెంట్ లో చేరారు. సాధారణంగా ఐఏఎస్‌లకు ఇచ్చే పోస్టింగును ఆయన పొంది అక్కడే స్వేరోను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయ అడుగులు తడబడ్డాయి. బీఆర్ఎస్ లో చేరి పూర్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లారు.