బంగారం, వెండి .. ఈ రెండింటికి భారతీయ సమాజంలో ఉన్న విలువ ప్రత్యేకం. ఇంట్లో వస్తువులన్నీ వెండితోనూ..ఒంటిపై ఆభరణాలు అన్నీ బంగారంతోనూ ఉండాలని కోరుకుంటారు. తమ సంపాదనలో సగం వీటి కోసమే వెచ్చిస్తారు. అయితే ప్రయారిటీలో బంగారం ముందు ఉంటుంది. ఎక్కువ రేటు కూడా బంగారానికే పెరుగుతుంది. కానీ రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందని వెండికి డిమాండ్ పెరుగుతుందని… రేట్లు కూడా పెరుగుతాయని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
గత కొంత కాలంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి బంగారం లక్ష దాటుతుందని అనుకున్నారు. కానీ ఆ మార్క్ దాటలేదు. దాని కిందనే ఊగిసలాడుతోంది. కానీ వెండి పరుగులు మాత్రం ఆగడం లేదు. కేజీ లక్ష దాటిపోయి ఇంకా ఇంకా ముందుకెళ్తోంది. లక్షా పదిహేను వేల దాకా వచ్చింది. ఈ పరుగు ఆగదని బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటి బ్యాంక్ వంటి సంస్థల నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది కాలంలో వెండి రేటు 13 శాతం పెరుగుతుంది కానీ.. బంగారం రేటు మాత్రం 25 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ఇప్పటి వరకూ పెరగడానికి ప్రధాన కారణం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున గోల్డ్ రిజర్వులు పెంచుకునే ప్రయత్నం చేయడమే. ప్రపంచవ్యాప్త అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇలా చేశారు. ఇక నుంచి ఇలాంటి డిమాండ్ బంగారానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది కాలంలో బంగారం తగ్గుదలను నమోదు చేస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో వెండి కి డిమాండ్ పెరుగుతోంది. ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నది అంచనాలతో ఈ పెరుగుదలను ఊహిస్తున్నారు.
బంగారంలో పెట్టుబడులు కన్నా.. రాబోయే రోజుల్లో వెండిలో పెట్టుబడుల వల్లే రాబడి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నిపుణుల అంచనాలు ఎంత మేరకు నిజం అవుతాయో మరి !