ఈయేడాది ప్రధమార్థం చాలా చప్పగా సాగింది. అరకొర విజయాలు తప్ప బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. దాంతో నిర్మాతలూ, అభిమానులూ ద్వితీయార్థంపై ఆశలు పెంచుకొన్నారు. దానికి తగ్గట్టు ఈ యేడాది చివరి వరకూ క్రేజీ సినిమాలే రాబోతున్నాయి. అందులో భాగంగా విడుదల కాబోతున్న చిత్రం `హరి హర వీరమల్లు`. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీ.ఎం అయిన తరవాత విడుదల అవుతున్న సినిమా ఇది. పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. కానీ చాలా కాలం తరవాత ఆయన నటించిన స్ట్రయిట్ సినిమా. అందులోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథ. నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకొని, పలుసార్లు వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 24న రాబోతోంది.
పవన్ కల్యాణ్ సినిమా వస్తోందంటే మరో సినిమాని పోటీకి దింపడానికి భయపడతారు. ఈసారి కూడా పవన్‌కు సోలో ఎంట్రీనే దొరికింది. పెద్ద స్టార్ సినిమా విడుదలై చాలా కాలం అయ్యింది. దాంతో బాక్సాఫీసు దగ్గర ఈ వారం వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ముందు రోజు నుంచే ప్రీమియర్లు మొదలైపోతాయి. టికెట్ రేట్లు పెంచుకొనే వెసులుబాటు కూడా దొరికింది. ఏపీలో ప్రీమియర్ షోకి టికెట్ రేటు ఆరు వందలుగా నిర్ణయించారు. ఎలా చూసినా… తొలి రోజు భారీ వసూళ్లు కుమ్ముకోవడం ఖాయం. టాక్ బాగుంటే… నాలుగురోజుల లాంగ్ వీకెండ్ ని వీరమల్లు క్యాష్ చేసుకొనే అవకాశం ఉంది.
దాదాపు రూ.250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన చిత్రమిది. ఆ పెట్టుబడి రాబట్టుకోవాలంటే కచ్చితంగా తొలి 4 రోజుల్లోనూ వీరమల్లు మ్యాజిక్ చేయాల్సిందే. ఆ సత్తా కూడా ఈ సినిమాకు ఉంది. సాధారణంగా ఓ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే దానిపై క్రేజ్ తగ్గుతుంది. కానీ వీరమల్లు అలా కాదు. పవన్‌పై ఉన్న అభిమానం, ట్రైలర్ లో జరిగిన మ్యాజిక్.. ఈ సినిమాపై ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచింది. అదే మ్యాజిక్ తెరపై కూడా కనిపిస్తే కచ్చితంగా వీరమల్లు రాజ్యమేలతాడు.