ఓ తెలుగు ప్రాజెక్టులో సమంత పేరు విని చాలా కాలం అయ్యింది. ఈమధ్య తను సినిమాల్ని చాలా ఆచి తూచి ఎంచుకొంటోంది. వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే సినిమాల్ని బాగా తగ్గించేసింది. కొన్ని ప్రాజెక్టులు ఆమె దగ్గరకు వెళ్లాయి. కానీ వివిధ కారణాల వల్ల ఒప్పుకోలేదు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లో కూడా ఆమెను తీసుకొందామనుకొన్నారు. కానీ చివరికి రాశీఖన్నాతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
చాన్నాళ్లకు సమంత తెలుగులో ఓ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆమె నందినిరెడ్డి దర్శకత్వంలో నటించబోతోందని తెలుస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ తరవాత నందిని మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఆమె కొన్ని కథలు సిద్ధం చేసుకొన్నారు. అందులో ఓ కథ సమంతకు వినిపించినట్టు తెలుస్తోంది. ఆ కథ సమంతకు బాగా నచ్చి, తన బ్యానర్లోనే రూపొందించాలని ఫిక్సయ్యారని సమాచారం. ఇటీవల సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాలేదు కానీ, నిర్మాతగా సమంతకు లాభాల్ని తెచ్చిపెట్టింది. నందిని రెడ్డి ప్రాజెక్ట్ కూడా లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని… నటిగా, నిర్మాతగా సమంతకు అన్ని విధాలా సంతృప్తికరమైన సినిమాగా మిగలబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంత – నందిని రెడ్డి కాంబోలో 2 సినిమాలొచ్చాయి. అందులో ‘ఓ బేబీ’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇది ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ కానుంది.