దేశంలో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రోజు రోజుకు క్షీణించిపోతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో డిమాండ్ పెరుగుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలే నిరూపిస్తున్నాయి.
దేశంలోని టాప్-8 నగరాలు హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ లలో ఇళ్ల అమ్మకాలు 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 14 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ కారణంగా కొనుగోలుదారులు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహిస్తున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA) వంటి విధానాలు మరియు రాజకీయ అనిశ్చితులు మార్కెట్‌ను స్తబ్దుగా మార్చాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య , మధ్యతరగతి కొనుగోలుదారులు ఇళ్లు కొనడంలో వెనుకాడుతున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు డిమాండ్ ఉన్నప్పటికీ, రూ. 50 లక్షల లోపు గృహాలకు డిమాండ్ తగ్గింది. దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, రుణ రేట్లు పెరగడం, మ పాధి అనిశ్చితులు కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలుచెబుతున్నాయి.
ముంబై , పుణె* నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ నగరాల్లో రియల్ మార్కెట్ కాస్త బెటర్ గా ఉంది. కానీ తగ్గుదల నమోదు అవుతోంది. ప్రాప్ ఈక్విటీ,అనరాక్ వంటి సంస్థల నివేదికల్లోనూ ఇవే వెల్లడి అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు.. వడ్డీ రేట్ల తగ్గింపు అనేది ఓ ప్లస్ పాయింటే కానీ.. అదే ప్లస్ పాయింట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమతోంది. రియల్ ఎస్టేట్ మెరుగుపడాలంటే.. ఇంకా చాలా పరిస్థితులు కలసి రావాల్సి ఉంది.