భాస్కరభట్ల రవికుమార్ మంచి కవి. అయితే కవి అయిన ప్రతి ఒక్కరూ గీత రచయిత కాలేరు. అయినా భాస్కరభట్లంత పాపులర్ కాలేరు. పాటకున్న మీటర్ వేరు. అది భాస్కరభట్లకు బాగా తెలుసు.
కొంతమంది గీత రచయితలు గొప్ప పాండిత్యం ప్రదర్శిస్తారు. తమకున్న భాషా పరిజ్ఞానమంతా పాటల్లో గుమ్మరిస్తారు. ‘ఈ పదం సామాన్యులకు అర్థం అవుతుందా, లేదా’ అనేది ఆలోచించరు. అదే అడితే..
‘అర్థం కాకపోతే అర్థాలు తెలుసుకొని మరీ ఆస్వాదిస్తారు’ అంటారు. ఆ మాటా కరెక్టే. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ప్రతీ పాట, అందులోని ప్రతీ పదం మనకు అర్థమైపోయిందా? సినారె, వేటూరి… వీళ్లంతా ప్రతీ పాటలోనూ సాధారమైన భాషే వాడారా? ఆ పాటల్లోని మాధుర్యం అర్ధమవ్వడానికి శబ్దరత్నాకరాలు కొనుక్కోలేదూ..?
అయితే భాస్కరభట్ల ఆ టైపు కాదు. అందరి దగ్గరా శబ్దరత్నాకరాలు కొనుక్కొని, చదువుకొనేంత టైమూ, ఓపిక ఉన్నాయో లేదో అని అందరికీ అర్థమయ్యే పదాలతోనే పాట కట్టేయగలడు.
మనకు తెలిసిన పదాలే
మనం వాడే భాషే
కానీ అతని కూర్పు.. తన నేర్పుతో
పాటైపోతూ ఉంటుంది.
అక్షరాల అమరికతో అల్లరి చేస్తాడు. పదాల పొందికతో సరదాలు సృష్టిస్తాడు. భావ సాగరంలో మునకేస్తాడు. భాషా ప్రవాహంలో మనల్ని ముంచేస్తాడు.
మాస్ పాటకు కేరాఫ్
ప్రేమ పాటకు తనే పేరాగ్రాఫ్
మనిషితనానికి, మనసు మౌనానికి ఆ పాటే ఆటోగ్రాఫ్!!
భాస్కరభట్ల మంచి కమర్షియల్ రైటర్. అతని పాట వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్ముతున్న వేడి వేడి మొక్కజొన్న పొత్తు. ఎండాకాలంలో క్వాలిటీ ఐస్ క్రీమ్ బండీ. తనకు గిరాకీ తగ్గదు. తన పాటలో ఇంగ్లీష్ మిక్స్ చేస్తాడు. ఉర్దూ కలిపేస్తాడు. ఇంగ్లీష్ ముక్కలు ఇలా వచ్చి, అలా పోతుంటాయి. నానా భాషల సమ్మేళనం తన పాట. అయినా వినడానికి బాగుంటుంది. ట్రెండింగ్ లో ఉన్న పదాల్ని భాస్కరభట్ల భలే పట్టేస్తాడు. తన పాటల్లో పదాలు ట్రెండింగ్ లోని తెస్తాడు. భాస్కరభట్ల ఇచ్చిన హుక్ లైన్లు ఎన్ని సినిమాలకు టైటిళ్లు అయిపోలేదూ..?
ఒక్క పాట చాలు. జనాల్ని థియేటర్లకు రప్పించడానికి. అలాంటి ఒక్క పాటలు ఎన్నిచ్చాడో?
‘ఎందుకే రమణమ్మా’ బెస్ట్ ఎగ్జాంపుల్.
అతని మాట చికెన్ ముక్క.
అతని పాట చిల్డ్ బీర్ చుక్క. ఇంతకంటే ఏం చెప్పగలం? ఈ మాస్ గీతిస్ట్ గురించి?
ఐటెమ్ పాట – ప్రతీసారీ భాస్కరభట్లని వెదుక్కొంటూ వెళ్తుంది. ప్రతీసారీ ఆయన తన అక్షరాలతో అభ్యంగన స్నానం చేయించి, పదాల పరికిణీ కుట్టించి మరీ ముస్తాబు చేస్తాడు. ఐటెమ్ పాటంటే అంగాంగ వర్ణన అనుకొంటారంతా. కానీ ప్రతీ పాటనీ ఓ థీమ్ లా ప్రజెంట్ చేస్తాడు భాస్కరభట్ల. ఐటెమ్ గీతాల బాప్ – ‘ఇప్పటికింకా నా వయసు..’ పాటే తీసుకోండి. అందులో ఓ అమ్మాయి అల్లరి కనిపిస్తుంది. చాంతాడంత కోరికల లిస్టు దర్శనమిస్తుంది. ఆ పాటలో ముమైత్ ఖాన్ కంటే, భాస్కరభట్ల పదాలే సెక్సీగా ఉంటాయి.
తను మాస్ గీతాలే రాయలేదు. ప్రేమ పాటలతోనూ పరవళ్లు తొక్కాడు. జీవిత సారాన్ని చిన్న చిన్న ముక్కల్లో చెప్పేశాడు. బతుకు సారాన్ని పంక్తుల్లో తేల్చేశాడు. తను గోదారి బిడ్డ. గోదారి నీళ్లు తాగొచ్చాడు. అందుకే ప్రతీ పాటలోనూ ఓ చమత్కారం కనిపిస్తుంది. కాబట్టే.. ఇన్నేళ్లయినా తన పాట బోర్ కొట్టదు. కొట్టబోదు కూడా.
భాస్కరభట్ల పాటల ప్రయాణానికి నేటితో పాతికేళ్లు.
ఈ జోరు ఇలానే కొనసాగాలి.. మరో వందేళ్లు తన పాట వినపడాలి.