ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్. చాలా కొద్ది కాలంలోనే ఔటర్ వరకూ నగంరం కిక్కిసిపోయింది. అందుకే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ను ప్లాన్ చేశారు. ఇప్పుడు కొత్తగా దేశంలోనే వినూత్నంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ప్రాంతీయ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది అలైన్మెంట్కు ఆమోదం లభించింది. మొత్తం 8 జిల్లాలను అనుసంధానించే 392-కి.మీ రైలు కారిడార్ ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే మొట్టమొదటి రింగ్ రైల్వే అలైన్మెంట్ను RRR ప్రాజెక్ట్ వెంట పూర్తి చేసింది. 392 కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు , 14 మండలాల గుండా వెళుతుంది, ఈ మార్గంలో 26 కొత్త స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ₹12,070 కోట్లు. ప్రస్తుత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నుండి 3 నుండి 5 కిలోమీటర్ల లోపల నడిచేలా రింగ్ రైల్వే అలైన్మెంట్ ఉంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలను కవర్ చేస్తుంది.
ప్రతిపాదిత రైలు కారిడార్లోని ఆరు విభాగాలు ఇప్పటికే ఉన్న, నిరుపయోగంగా ఉన్న రైల్వే లైన్లను అభివృద్ధి చేస్తారు. భూసేకరణతో పాటు నిర్మాణ వ్యవధిని దీని ద్వారా తగ్గిస్తారు. RRR ప్రాజెక్ట్ హైదరాబాద్ ను మరింత విశాలంగా మారుసతుంది. వృద్ధిని వికేంద్రీకరిస్తుంది. ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఆధారిత అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ప్రతిపాదిత 26 స్టేషన్లను ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో భాగంగా నిర్మిస్తారు. ఇది సబర్బన్ రైల్వే, బస్సు , మెట్రో వంటి వాటికి అనుబంధంగా ఉంటుంది.
అలైన్ మెంట్ కూడా పూర్తి అయినందున.. పనులు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు, భూసేకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. వచ్చే ఒకటి, రెండేళ్లలో పట్టాలెక్కితే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.