పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే కొన్ని అనివార్యకారణాల వలన ఈ సినిమా సుధీర్గ కాలం ప్రొడక్షన్ లోనే వుండిపోయింది. దీంతో దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశారు. అయితే ఆయన బయటి రావడంలో ఎలాంటి వివాదం లేదు. పవన్ కూడా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. మిగిలిన సినిమాని నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ ఇద్దరే కాదు.. ఈ సినిమాకి పవన్ కూడా దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
‘‘హరి హర వీరమల్లు ఆసక్తికర కథ. అప్పట్లో హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు. అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్రే ‘హరిహర వీరమల్లు’. ఏపీలోని కొల్లూరులో కోహినూర్ వజ్రం దొరికింది. అది అలా అలా చేతులు మారి లండన్ మ్యూజియంలో ఉంది. క్రిష్ చెప్పిన ఆ కథ నాకు నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం నాకున్న శక్తినంతా పెట్టాను. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ సాధన చేసి, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌కు దర్శకత్వం వహించా. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను. మీరు కోరుకునే సక్సెస్ నేనూ కోరుకుంటున్నా. మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి’అని చెప్పుకొచ్చారు పవన్.