విజయవాడ, విశాఖల్లో మెట్రోలను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వనున్నారు. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు ఇస్తారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు శుక్రవారమే టెండర్లు పిలవనున్నారు. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తారు. ఇందులో రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలుస్తారు.
విజయవాడ, విశాఖల్లో మెట్రోల కోసం 2014-19 మధ్యనే డీపీఆర్ రెడీ చేయించారు. మెట్రో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న శ్రీధరన్ సేవలను వినియోగిచుకున్నారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అప్పటి వరకూ జరిగిన ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఫలితంగా మెట్రో కల నేరవేర్చుకోవడానికి విశాఖ, విజయవాడ ప్రజలకు అవకాశం దొరకలేదు. ప్రభుత్వం మారగానే.. కూటమి ప్రభుత్వం ఈ మెట్రోలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది.
మెట్రో పనులు టెండర్లు ఖరారు చేసిన తర్వాత ఇక పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో పూర్తి స్థాయిలో మెట్రోను నిర్మాణాన్ని ఫుల్ స్వింగ్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ రెండు సిటీల్లో మెట్రో పనులు జోరందుకుంటే. రియల్ రంగం కూడా ఊపందుకుంటుంది.