నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన సమయంలో ఆర్డినెన్స్ వెనక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆమోదం లభించడం అసాధ్యమన్న సంకేతాలు వస్తున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ ఆర్డినెన్స్ విషయంలో న్యాయసలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపించారు. అక్కడ పరిశీలన చేసి.. అందులో ఏమైనా రాజ్యాంగ లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపుతూ వెనక్కి పంపుతారు. గవర్నర్ అదే సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. అంటే ఆర్డినెన్స్ ఆగిపోతుందన్నమాట.
ఇప్పటికే అదే అంశాలతో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కేంద్రానికి వెళ్లింది. ఆ బిల్లు పరిస్థితి ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే పలు అంశాలపై క్లారిటీ కోరుతూ కేంద్రం కూడా వెనక్కి పంపిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఎలా చూసినా రిజర్వేషన్ల పెంపు అనేది రాజ్యాంగసవరణతో ముడి పడి ఉంటుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు.
ఈ క్రమంలో ఏం చేయాలన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది . పాత రిజర్వేషన్లతోనే నోటిఫికేషన్ ఇచ్చేసి.. రాజకీయంగా పార్టీ తరపున రిజర్వేషన్లు కల్పించడం ఓ మార్గంగా భావిస్తున్నారు. ఏదో ఓ నిర్ణయం తీసుకుని నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. రాజకీయంగా వివాదం వచ్చినా ఎదుర్కొని .. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.