వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రాజకీయం రాజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై కింది స్థాయిలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు పైదాకా చేరిందని.. జగన్ సైతం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెబుతున్నారు. ఈ వారం జగన్ తాడేపల్లికి రాకపోవడానికి కారణం.. సజ్జలేనని అంటున్నారు. కీలక అంశాలన్నింటినీ ఇక తానే చక్క బెట్టుకోవాలని సజ్జల ప్రమేయం లేకుండా చూడాలని అనుకుంటున్నారు. తనకు ఎదురవుతున్న సమస్య నుంచి బయటపడేందుకు జగన్ బెంగళూరు నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సజ్జలకు ప్రమేయం లేకుండా పోయింది.
నెరేటివ్ సెట్ చేయలేకపోయిన సజ్జల
లిక్కర్ స్కాం విషయంలో జరుగుతున్నదంతా కక్షసాధింపులేనని నెరేటివ్ సెట్ చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి విఫలమయ్యాడని జగన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా మొత్తం మ్యానేజ్ చేసేందుకు అవకాశాలు కల్పించినా ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడం జగన్ ను అసహనానికి గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం స్కాం జరిగిన విధానాన్ని.. ప్రతీ డీటైల్ తో సహా ప్రజల ముందు పెడుతూండటంతో దానికి తగ్గట్లుగా ఎందుకు బలమైన వాదన వినిపించలేకపోతున్నారన్న జగన్ ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానాలు లేకుండా పోయాయని తెలుస్తోంది.
సాక్షి మీడియాలోనూ గందరగోళం
సాక్షి మీడియాలోనూ బలమైన వాదన వినిపించలేకపోవడానికి కారణం ఏమిటో జగన్ కూ అర్థం కావడం లేదు. ఓ రోజు ఆర్నేష్ కుమార్ కేసులో తీర్పు అంటూ ఫుల్ పేజీ రాస్తారు. అరెస్టులు చేయవద్దన్నట్లుగా రాసిన ఆ కథనం ఎకడమిక్ గా ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అరెస్టుల గురించి చర్చలు రేకెత్తించింది. వైసీపీ హయాంలో ఏం చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. ఇప్పుడు ఎవర్నీ రాత్రికి రాత్రి అరెస్టు చేయడం లేదు. అన్ని న్యాయపరమైన అవకాశాలు ఇస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి అక్కడ కూడా ఊరట దక్కకపోతేనే అరెస్టు చేస్తున్నారు. మరి అక్రమ అరెస్టుల అంశం ఎక్కడ తెరపైకి వస్తోంది..?.
ఇప్పటికే జగన్ ను ఒంటరిని చేసిన సజ్జల
అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. జగన్ కు తాను తప్ప మరో దిక్కు లేదని అనుకుంటున్నారు. అందుకే జగన్ జైలుకెళ్లినా తాను పార్టీ నడుపుతానని ధైర్యంగా చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ముందస్తు ప్రణాళికలతోనే తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేకుండా చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. అయోధ్య రామిరెడ్డిపై పార్టీ మార్పు ప్రచారం చేసి నమ్మకుండా చేశారు. వైవీ సుబ్బారెడ్డిని చాలా కాలం నుంచి జగన్ నమ్మడం లేదు. చెవిరెడ్డి జైల్లో ఉన్నారు. ఇలా అందర్నీ దూరం చేసేసిన సజ్జల..జగన్ ను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ కు ప్రత్యామ్నాయం కూడా దొరికే అవకాశం కనిపించండి లేదు. ఆయనకు రాజకీయం చేయడం చేత కాదు.