తెలంగాణ రాజకీయాలు పూర్తిగా ప్రజా కోణం నుంచి పక్కకు పోయిన సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, బీసీ రాజకీయాల పేరుతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు చేసుకోవడంతోనే రోజులు గడిచిపోతున్నాయి. ఆ అంశాలపై ప్రజలకు ఆసక్తి ఉందా లేదా … వారు కనెక్ట్ అవుతున్నారా లేదా అన్న అంశాలను రాజకీయ పార్టీలేవేమీ పట్టించుకోవడంలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడే పార్టీలేవీ కనిపించడం లేదు.
బీసీ రిజర్వేషన్ల రాజకీయానికే పెద్ద పీట
కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల గండాన్ని ఎలా దాటాలాన్న అంశంపైనే తమ దృష్టి ఎక్కువ కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇదొక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది ప్రజల సమస్య కాదు. కాంగ్రెస్ సమస్య. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్. పరిష్కరించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే. ఆ విషయం కాంగ్రెస్ కు తెలుసు కాబట్టి రాజకీయం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచడం అనేది రాజ్యాంగ సవరణతో తప్ప సాధ్యం కాదని సాధారణ ప్రజలకూ క్లారిటీ ఉంది. అందుకే వారు ఎమోషనల్ కావట్లేదు. ఈ అంశంతో వారు ఎప్పుడో డిటాచ్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ మాత్రం.. కాంగ్రెస్ ట్రాప్ లో పడింది.
ట్యాపింగ్ పేరుతో గాసిప్ పాలిటిక్స్
బీసీ రిజర్వేషన్ల అంశం తర్వాత ట్యాపింగ్ గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ తమపైనే ఆరోపణలు వస్తున్నాయని.. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు కూడా మరకలు అంటిస్తే బ్యాలెన్స్ అయిపోతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో.. ట్యాపింగ్ తప్పిదం కాదని..అనుమతి తీసుకోవాలని అన్న మాటల్ని తీసుకుని.. కొత్తగా నేరెటివ్స్ అల్లుతున్నారు. ఆఖరికి తన భార్య ఫోన్ ట్యాప్ చేశారని.. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించే స్థాయికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంతో ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే ఇలాంటి రాజకీయాలు చేయరు. కానీ తమపై సిట్ విచారణ పేరుతో నిందలు వేస్తున్నారు కాబట్టి తాము కూడా వేస్తే బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటున్నారు.
ప్రజల గురించి పట్టించుకునేవారెవరు ?
అటు అధికార పార్టీ.. ఇటు విపక్షాల రాజకీయం టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా నడుస్తోంది. వ్యక్తిగత ఈగోలను తీర్చుకోవడానికి.. అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఒక్క రాజకీయ పార్టీ లేదా నేత కూడా ఆసక్తి చూపించడం లేదు. తమ సమస్యలపై ప్రజలకే స్పష్టత లేదని అందుకే రాజకీయంగా మసాలా అంశాలకే ప్రాధాన్యం ఉంటుందని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ ప్రజల సమయం చూసి నిర్ణయం తీసుకుంటారన్న విషయాన్ని మర్చిపోయాయి. తెలంగాణ రాజకీయాలు ఇలా ఊహాజనిత అంశాలు.. అమలు కాని నిర్ణయాల మధ్య ఊగిసలాడుతున్నాయి. పూర్తిగా ప్రజలతో టచ్ కోల్పోయాయి.