రాహుల్ గాంధీ దేశంలో మరే సమస్య లేనట్లుగా కులాన్ని పట్టుకుని రాజకీయాల్ని ఈదేయాలనుకుంటున్నారు. కులగణన ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరిస్తుందని అంటున్నారు. ప్రతి అంశంలోనూ ఆయన లెక్కలు తీస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేవారిలో ఎంత మంది ఓబీసీలు ఉంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల్లో ఎంత మంది ఓబీసీలు ఉన్నారని అంటున్నారు. ఆయన లాజిక్ ప్రకారం.. ప్రతి రంగంలోనూ జనాభాకు తగ్గట్లుగా వారి ప్రాతినిధ్యం ఉండాలి. అది కులగణనతోనే సాధ్యమవుతుంది. కానీ ఎలా సాధ్యమవుతుందో మాత్రం చెప్పడం లేదు.
కులాల లెక్క తెలిస్తే ఏం మారుతుంది ?
కులగణన అంటే ఎంత మంది ఏ కులస్తులు ఉన్నారో లెక్క మాత్రమే బయటకు వస్తుంది. దాని ద్వారా అవకాశాల్ని అందరికీ పంచాలని ఆయన అంటున్నారు. అవకాశాలు ఉంటే.. ప్రభుత్వ చేతుల్లో ఉన్నంత వరకూ అంటే రాజకీయంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచగలరు. కానీ దాని వల్ల వారు పైకి వస్తారన్న గ్యారంటీ ఉందా?. ఎంత మందికి అలా అవకాశాలు కల్పించగలరు ?. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ వర్గాలు ఇంకా ఎందుకు అణగారిపోయి ఉన్నాయో రాహుల్ చెప్పలేరు.
రిజర్వేషన్లు ఉన్నా ఎస్సీ, ఎస్టీలు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు ?
కులగణనతో ప్రత్యేకంగా వచ్చేదేమీ ఉంటుందన్నది రాహుల్ చెప్పరు. కానీ అదే అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్నారు. కులగణన జరిగితే బీసీలందరూ లక్షాధికారులు, పారిశ్రామికేత్తలవుతారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎలా అన్నది మాత్రం చెప్పరు. తెలంగాణలో కులగణనతో ఏం చేశారో చెప్పడం లేదు. కానీ దేశానికి ఆదర్శం అని రుద్దేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అసలు తెలంగాణ ప్రజల్లో కులగణన అంశంపై ఉన్న అభిప్రాయాలేమిటో రాహుల్ తెలుసుకునే ప్రయత్నం చేసినా.. ఇలా మాట్లాడేవారు కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
కుల రాజకీయంతో ప్రజల మధ్య విభజన
బీజేపీ మతంతో రాజకీయం చేస్తోంది కాబట్టి తాను కులంతో రాజకీయం చేస్తేనే ఎదుర్కొంటానన్న ఓ గుడ్డి నమ్మకంతోనే రాహుల్ రాజకీయం చేస్తున్నారు. కానీ దేశాన్ని ఈ రాజకీయం .. మరింత కుల ఊబిలోకి నెడుతోందని.. ప్రజల్లో విభజనకు కారణం అవుతోందని మాత్రం అనుకోవడం లేదు. అక్కడా రాహుల్ గాంధీ ఫెయిలవుతున్నారు. పైగా ఇప్పుడు గతంలోనే తాము చేసి ఉండాల్సిందని తప్పు చేశామని అంటున్నారు. తప్పు చేసిన వాళ్లను ప్రజలు ఎలా క్షమిస్తారు ?