పిల్లలు పుట్టడానికి ప్రసాదం ఇస్తానని చిలూకూరు బాలాజీ పూజారి ఓ మాట చెబితే ఆ రోజున.. చిలుకూరుకు వేల మంది వచ్చారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయిపోయింది. ఆ చిలుకూరు ఆలయ పూజారి స్వార్థం గురించి పక్కన పెడితే.. పిల్లల కోసం ఎన్ని జంటలు ఇలా వేదన పడుతున్నాయన్నదానికి అదో సాక్ష్యంలా మారింది. ఇప్పుడు వీధి వీధికి వెలుస్తున్న ఇన్ ఫెర్టిలిటీ క్లినిక్లు సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు జనాభా పెంచాలని అంటున్నాయి. ఇతర దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఇక్కడకు రాక ముందే మేలుకోవాలని అంటున్నాయి. ఓ వైపు మారుతున్న యువత ఆలోచనలు, పెరుగుతున్న ఇన్ ఫెర్టిలిటీ సమస్యతో ప్రభుత్వాల ఆలోచనలకు లక్ష్యాలకు పొంతన ఉండటం లేదు. అందుకే కొన్ని చర్యలు తీసుకోక తప్పడం లేదు.
జనాభా తగ్గుదలను ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. జనాభా పెంచేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. నోటి మాటల ద్వారానే కాకుండా.. ఓ పాలసీని కూడా రెడీ చేస్తున్నారు. చైనాలో ఇప్పుడు బిడ్డల్ని కంటే లక్షలకు లక్షల సాయం చేస్తున్నారు. రెండో బిడ్డ కంటే పూర్తి ఖర్చు భరిస్తామంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండానే ఇక్కడ ముందుగానే కొంతమేరకు ప్రయోజనాలు కల్పించేందుకు చంద్రబాబు పాలసీ రెడీ చేస్తున్నారు. ఇందులోనే అసలు సమస్యను గుర్తించారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కు సాయం కూడా పాలసీలో ఓ భాగంగా ఉండనుంది.
ఐవీఎఫ్ అనేది ఇప్పుడు సంతానోత్పత్తికి కీలకంగా మారింది.కానీ ఈ చికిత్స సామాన్యులకే కాదు.. మధ్యతరగతికే అందుబాటులో లేదు. అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్సా విధానం ఇది. పిల్లలు పుట్టని దంపతులు వైద్య ఖర్చులు భరించలేక దేవుడి దయ అని వదిలేస్తున్నారు. పల్లెల్లో ఇలాంటి జంటలు ఎన్నో ఉంటున్నాయి. వారికి ఇలాంటి చికిత్సలపై సందేహాలు కూడా ఉంటాయి. అవగాహన కూడా ఉండదు. ప్రభుత్వాలు తమ యంత్రాంగం ద్వారా మోటివేట్ చేసి వారికి ఉచితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఇప్పిస్తే వారి పిల్లల కల తీర్చడమే కాదు.. జనాభా పెంచాలన్న లక్ష్యానికీ చేరువ అవుతారు.
ఏపీ ప్రభుత్వం జనాభా పాలసీలో ..ఉచిత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఓ భాగంగా పెడుతున్నారు. ఆషామాషీగా కాకుండా.. ఇప్పటికే పిల్లలున్న వారిని మాత్రమే కాకుండా.. పిల్లలు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారిని గుర్తించి వారికి కావాల్సిన వైద్య చికిత్సలు అందుబాటులోకి తెస్తే.. జనాభా పెంచాలన్న టార్గెట్ అందుకుంటారు. ఇది పాలసీలాగానే కాకుండా.. అమల్లో కూడా ఉండాలి.