కేటీఆర్ ఇప్పుడు సీఎం రమేష్‌కు, రేవంత్ రెడ్డికి లింక్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఓ రోడ్ కాంట్రాక్ట్‌ను రిత్విక ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. కాంపిటీటివ్ టెండర్లలోనే దక్కించుకున్నారు. నేరుగా నామినేషన్ పద్దతిలో ఇవ్వలేదు. అయినా కేటీఆర్ వెంటనే.. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వచ్చిందంటే ఎంత కిరికిరి జరుగుతుందో తెలుసుకోవాలంటూ ఆరోపణలు ప్రారంభించారు.
ఇది మోకాలికి, బోడిగుండుకూ ముడిపెట్టినట్లుగా కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టడానికి సీఎం రమేష్ సహకరించారని అందుకే.. ఆ కాంట్రాక్టుకు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. ఓ బీజేపీ ఎంపీ సహకరించారని తాను గతంలోనే చెప్పానని ఇప్పుడు ఆ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అని బయటపడిందని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ మాటల్లో కనీస లాజిక్ లేకుండా పోయింది.
కంచ గచ్చిబౌలి భూముల్ని తాకట్టు పెట్టలేదు. బాండ్లు రిలీజ్ చేశామని గతంలోనే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న కీలకమైన వర్గాలన్నింటి నుంచి సమాచారం వచ్చింది.అదే సమయంలో ఈ బాండ్ల వ్యవహారాన్ని చూసిన సంస్థకూ కమిషన్లు ఇచ్చారు. ఇందులో సీఎం రమేష్ వ్యక్తిగత హోదాలో లేదా.. ఎలా సహకరించారన్నది కేటీఆర్ చెప్పలేదు. అసలు ఇలా అప్పులు ఇప్పించేలా సీఎం రమేష్ ఏమైనా వ్యాపారం చేస్తున్నట్లుగా ఎవరికీ తెలియదు.
గతంలో సీఎం రమేష్ తన సామాజికవర్గమే కదా.. సహకరిస్తారని కొన్ని అంశాల్లో కేటీఆర్ సాయం అడిగారని.. కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చూపించిన అహంకారం వల్ల సీఎం రమేష్ ఎలాంటి సహకారం అందించడం లేదన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అందుకే కేటీఆర్ కు కోపం వచ్చి ఈ బురద చల్లేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.