ఫ్యూచర్ సిటీలో రుత్విక్ ప్రాజెక్ట్స్ కు ఏదో కాంట్రాక్ట్ వచ్చిందని.. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటూ రాజకీయం చేయబోయిన కేటీఆర్‌కు.. సీఎం రమేష్ గట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించలేదనే అసహనంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని తన ఇంటికి కేటీఆర్ వచ్చి కవితతో సహా అందరిపై విచారణలు ఆపేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారన్నారు. అయితే కేటీఆర్ ప్రతిపాదనల మేరకు తాను బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడానన్నారు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ అంగీకరించలేదని కూడా చెప్పాన్నారు. ఆ అసహనంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరెవరు తన ఇంటికి వచ్చారో మొత్తం సీసీ ఫుటేజీ ఇస్తానని.. అలా తన ఇంటికి రాలేదని.. విలీనంపై మాట్లాడలేదని కేటీఆర్ తన ఇష్టదైవంపై ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్టులు సీఎం ఎవరికి కావాలనుకుంటే వాళ్లుక ఇవ్వగలరా.. పదేళ్లు కేసీఆర్ అలాగే కాంట్రాక్టులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటున్నారని పదేళ్లు ఎవరెవరికి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో లెక్క తీద్దామని సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి స్నేహితులని.. కేటీఆర్, కేసీఆర్ రాజకీయంగా ఎదిగాక అందర్నీ మర్చిపోయారన్నారు. తాము అలా కాదన్నారు. రాజకీయం వేరు స్నేహం వేరన్నారు. కేటీఆర్ పదేళ్ల పాటు ఏం చేశారో మొత్తం తెలుసన్నారు. అమెరికా కు, మాల్దీవులకు ఎలా వెళ్లారో.. ఎవరితో వెళ్లారో మొత్తం తెలుసని.. అవన్ని ఈడీ, సీబీఐకి ఇస్తానన్నారు. మీ గురించి మీ చెల్లెలే చెప్పారని..మేము చెప్పేదముందన్నారు.
బీజేపీలో విలీనానికి కేటీఆర్ మనస్ఫూర్తిగా సహకరించలేదని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారేమో కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ .. ఇప్పుడు సీఎం రమేష్ కు కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. సైలెంట్ గా ఉంటే నిజమనుకుంటారు.. సీఎం రమేష్‌పై మళ్లీ ఆరోపణలు చేస్తే.. ఆయన మరిన్ని విషయాలు బయట పెడతారు.