తెలంగాణకు కొత్త నాయకత్వం కావాల్సిన సమయం ఆసన్నమయిందని కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి భవిష్యత్ లీడర్ల కోసం భారీ శిక్షణా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత నిర్మగర్భంగా చాలా వ్యాఖ్యలు చేశారు. కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా కొత్తగా, నవీనంగా ఉంటేనే సంస్థలు నిలబడతాయన్నారు. అందుకే రాబోయే రోజుల్లో జాగృతిని మార్చబోతున్నట్లుగా చెబుతున్నారు. జాగృతిని రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారని అనుకోవచ్చు.
లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరని.. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడన్నారు. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాలని శతృవు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. మన ఆలోచనే ఆయుధం కావాలని సలహా ఇచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అని వివరించారు. నమ్మిన సిద్దాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరై, ఎదురొడ్డి నిలిచిన సంస్థ తెలంగాణ జాగృతి మాత్రమేనన్నారు.
తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.రాజకీయ పార్టీగా మార్చే వ్యూహంలో కవిత లీడర్ షిప్ ను డెవలప్ చేసుకుంటున్నారు. కవిత వైపు యువ నేతలు వెళ్లకుండా.. కవిత సమావేశం పెట్టిన చోటుకు దగ్గరలోనే బీఆర్ఎస్ కూడా సమావేశం నిర్వహించింది. ఉదయం హరీష్ రావు, సాయంత్రం కేటీఆర్ ప్రసంగించారు.