కేటీఆర్, సీఎం రమేష్ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ అవుతోంది. బీజేపీలో విలీనానికి ప్రయత్నించి విఫలమయ్యారని ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ విలీనంపై చాలా సార్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా… కేసీఆర్ కలసి పనిచేసేందుకు సిద్ధమని వచ్చారని కానీ తాము అంగీకరించలేదని అన్నారు. ఆ తర్వాత విలీనానికి ప్రయత్నించారని .. తన ద్వారానే ప్రయత్నించారని సీఎం రమేష్ ప్రకటించారు. ఆయన ఇలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే.. కేటీఆర్ తొందరపాటు వల్ల. బురద చల్లేయాలని అనుకోవడం వల్ల.
సీఎం రమేష్ చెప్పిన మాటలు అబద్దాలని కేటీఆర్ ఖండించరా ?
సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన విషయాలు చిన్నవి కాదు. సంచలనాత్మకమైనవి. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేవి. నిజం కాదు అని చెబితే తాను సాక్ష్యాలు బయట పెడతానని సీఎం రమేష్ అంటున్నారు. సీఎం రమేశ్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన తమ వర్గమే కాబట్టి.. మేలు చేస్తాడని కేటీఆర్ వెళ్లారు. వారి కోరిక మేరకు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆయనపైనే నిందలేస్తున్నారు. సాయం చేయాలని ప్రయత్నించిన తనపై బురద చల్లితే.. ఒకే సామాజికవర్గం అని సీఎం రమేష్ తుడుచుకుని వెళ్లరుగా. అన్నీ బయట పెట్టారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత నైతికత ఉండాలి. కానీ కేటీఆర్ అలాంటిదేమీ పాటించకపోవడంతో సీఎం రమేష్ తన రాజకీయం ప్రారంభించారు.
కమ్మ, రెడ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకోగలరా ?
కమ్మ వర్గ నేతల్ని కేటీఆర్ దారుణంగా తిట్టారని సీఎం రమేష్ చెప్పారు. తుమ్మల అంశంలో ఆయన స్పందించారు. ఇప్పుడు కమ్మ వర్గంపై తాను ఆ మాటలు అనలేదని కేటీఆర్ వివరణ ఇచ్చుకోలగరా?. ఇవ్వకపోతే ఆయన పార్టీలో కమ్మ నేతలు మనస్ఫూర్తిగా ఉండగలరా?. ఇదే పరిస్థితి రెడ్డి సామాజికవర్గ నేతలకూ ఉంది. కాంగ్రెస్ గెలిచాక రెడ్లు అంతా రేవంత్ వైపు వెళ్లిపోయారని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి నేతలు .. మనస్ఫూర్తిగా ఉండగలరా?. సీఎం రమేష్ తో కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ఆయన బయట పెట్టడం వల్ల.. బీఆర్ఎస్ కు జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. ఇదంతా కేటీఆర్ .. తొందరపాటు వల్లే జరిగింది.
కేసీఆర్ నుంచి కేటీఆర్ నేర్చుకున్నదేంటి?
కేసీఆర్ నుంచి కేటీఆర్ ఏం నేర్చుకున్నారని జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సామాన్యుడికి కూడా సందేహం వస్తుంది. కేసీఆర్ రాజకీయాలను రాజకీయంగా చేసేవారు. కానీ కేసీఆర్ తిట్టేవారు కాబట్టి తాను తిడితే సరిపోతుందని కేటీఆర్ అనుకుంటున్నారు. ఇతర పార్టీల నేతల వద్ద ఇష్టం వచ్చినట్లుగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం రాజకీయ నేతలకు ఆత్మహత్యా సదృశం లాంటిది. పైగా.. ఆ నేతల్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు గతంలో జరిగిన పరిణామాల్ని గుర్తు పెట్టుకోవాలి. కేటీఆర్ నాయకత్వ లోపాలు.. వ్యూహాం లేని తప్పిదాల వల్ల భారత రాష్ట్ర సమితి పరువు రోజు రోజుకు మసకబారిపోతోంది. కవిత చెప్పినట్లుగా.. బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకత్వం కావాల్సిందేనేమో ?