జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్‌రెడ్డి. ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మిథున్‌రెడ్డిని అరెస్టు చేసినప్పటి నుండి జగన్‌రెడ్డి ఏపీకే రాలేదు. ఇక ఆయనను పరామర్శిస్తారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ములాఖత్‌లు వారానికి మూడు చాన్స్ ఉన్నా.. కుటుంబసభ్యులు తప్ప ఎవరూ వచ్చి మిథున్‌రెడ్డిని పలకరించడం లేదు.
మిథున్‌రెడ్డి అరెస్టుపై తూ..తూ మంత్రం స్పందన
మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని వైసీపీ ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో ఆ పార్టీ క్యాడర్ కు అర్థం కావడం లేదు. సాదాసీదాగా ప్రెస్‌మీట్ పెట్టిన కొంత మంది.. ఆయన అరెస్టును రాజకీయ కక్ష పూరిత చర్యగా చెప్పి సైలెంట్ అయిపోయారు. ఈ మాటలు చెప్పని సీనియర్ నేతలు కూడా చాలా మంది ఉన్నారు. జగన్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టి సైలెంట్ అయ్యారు. ఎక్కడా చిన్న నిరసన ప్రదర్శన చేయడం లేదు. వైసీపీ పూర్తిగా మిథున్‌రెడ్డిని దూరం పెట్టిందని ఈ పరిణామాలతో భావిస్తున్నారు.
మిథున్‌రెడ్డి కంటే వీరమల్లుకే ప్రాధాన్యత
వైసీపీ నేతలు అసలు పట్టించుకోకపోతూంటే వైసీపీ మీడియా, సోషల్ మీడియా పూర్తిగా వీరమల్లుకు తమ సమయం కేటాయించారు. వీరమల్లు ఫ్లాప్ అని చెప్పడానికి పూర్తి సమయం కేటాయించారు. బలగం మొత్తాన్ని వీరమల్లుకు వ్యతిరేక ప్రచారం చేయడంపైనే దృష్టి పెట్టారు. సాక్షి మీడియాలో విశ్లేషణలు చేశారు. పనికి మాలిన పోలికలతో పవన్ ను కించ పరిచేందుకుఏ మాత్రం వెనుకాడలేదు. దీని వల్ల రాజకీయంగా వైసీపీకి ఏం లాభం జరుగుతుందో కానీ.. మిథున్‌రెడ్డిని మర్చిపోయి మరీ ఇలా చేయడంతో .. ఆ పార్టీ క్యాడర్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కీలక నేతల్ని అరెస్టు చేసినా గాలికి వదిలేసి.. ఇతరులపై బురద చల్లడానికే రాజకీయమా అని మథనపడుతున్నారు.
రాజ్ కేసిరెడ్డిని వేసినట్లుగా మిథున్‌రెడ్డిని టీడీపీ ఖాతాలో వేస్తారా ?
రాజ్ కేసిరెడ్డి ఓ కంపెనీలో.. విజయవాడ ఎంపీతో కలిసి డైరక్టర్ గా ఉన్నారని.. ఆయనను టీడీపీ ఖాతాలో వేసి ప్రచారం చేసింది వైసీపీ. ఇప్పుడు మిథున్‌రెడ్డి కూడా ఏదో ఓ టీడీపీ నేతకు లింక్ పెట్టి. .. ఆయనను కూడా టీడీపీ ఖాతాలో వేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మిథున్‌రెడ్డితో తనకేం సంబంధం లేనట్లుగా జగన్ వ్యవహరిస్తూండటంతో ఏదో జరగబోతోందని అనుకుంటున్నారు.