సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల ప్రభావం కీలక రంగాలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాదిలో యువత ఎక్కువగా అధిక ఆదాయం ఉన్నవారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే అవుతున్నారు. వారు పెట్టే ఖర్చులు, పెట్టుబడుల కారణంగానే చాలా రంగాల్లో దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు మెల్లగా సాఫ్ట్ వేర్ రంగంలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో లే ఆఫ్స్ సీజన్ వచ్చేసింది. సాధారణంగా మాంద్యం వల్ల లే ఆఫ్స్ ప్రకటిస్తారు..కానీ ఇప్పుడు ఏఐ, ఆటోమేషన్ వల్ల తొలగింపులు జరుగుతున్నాయి.
మాస్ లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగుల్లో ఓ రకమైన భయం నెలకొంది. ఉద్యోగ భద్రత గండంగా మారడంతో దీర్ఘకాలిక పెట్టుబడులపై వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు వంటి వాటిపై ఆలోచిస్తారు. ఇప్పటికే ఐటీ కారిడార్ ఉన్న హైదరాబాద్ వెస్ట్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగుపడలేదు. మార్కెట్ కు మించి లగ్జరీ ప్రాజెక్టులు నిర్మించేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇంకా డిమాండ్ తగ్గనుంది. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో ఎంత పెద్దస్థాయిలో ఉన్నా.. సరే కాస్త ఆలోచిద్దామని అనుకునేవారి సంఖ్య పెరుగుతుంది.
ఇతర రంగాల వారిపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై అంచనాలు లేవు. అయితే రియల్ ఎస్టేట్ మందగిస్తే ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు మందగిస్తాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఎక్కడ బలహీమైనా పరిస్థితి తారుమారవుతుంది. అందుకే.. కొంత కాలం ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది.