గతవారం బాక్సాఫీసుకు కాస్త ఊపొచ్చింది. ‘హరి హర వీరమల్లు’ ఓపెనింగ్స్ అదిరాయి. ప్రీమియర్ షోలకు టికెట్ దొరకని పరిస్థితి. యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’ అనూహ్యంగా నిలదొక్కుకొంది. ఆదివారం హైదరాబాద్ లో అన్ని షోలూ హౌస్ ఫుల్సే. పిల్లలు ఈ సినిమా చూడ్డానికి ఎగబడుతున్నారు. హిందీ మూవీ ‘సయారా’కు తెలుగునాట మల్టీప్లెక్స్‌లలో ఆదరణ బాగుంది. మొత్తానికి జనాలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. ఈవారం ‘కింగ్ డమ్’ రూపంలో మరో క్రేజీ సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. తన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. పైగా ‘కింగ్ డమ్’ ట్రైలర్, టీజర్ మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. సినిమా జోనర్, సెటప్.. కొత్తగా అనిపిస్తున్నాయి. విజయ్ తో పాటుగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై చాలా నమ్మకంగా మాట్లాడుతున్నారు. అన్నీ కుదిరితే… ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ తరవాత అంతటి విజయాన్ని విజయ్ ఈ సినిమాతో దక్కించుకొనే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుంచే ఈ సినిమాకు ప్రీమియర్లు పడే అవకాశం ఉంది.
ఈ సినిమాతో పాటుగా డబ్బింగ్ బొమ్మ ‘సార్ మేడమ్’ విడుదలకు సిద్ధమైంది. విజయ్‌సేతుపతి, నిత్యమీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ వస్తుంటుంది. పైగా నిత్యమీనన్ తెలిసిన అమ్మాయే. తనకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిక్కడ. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగిబాబు ఓ కీలక పాత్ర పోషించాడు. యోగిబాబు కామెడీ టైమింగ్ బాగా కుదిరినట్టు ట్రైలర్ లో అర్థం అవుతోంది. ఫ్యామిలీ డ్రామాల్ని ఇష్టపడేవాళ్లకు ఈ వారం ‘సార్ మేడమ్’ మంచి ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘కింగ్ డమ్’కు ఆగస్టు 14 వరకూ మంచి స్పేస్ వుంది. మధ్యలో రెండు వారాల గ్యాప్ ని ‘కింగ్ డమ్’ ఉపయోగించుకొంటే వసూళ్లకు తిరుగుండదు. ఆగస్టు 14న ఒకేసారి ‘కూలీ’, ‘వార్ 2’ వస్తున్నాయి. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసుని షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా `కింగ్ డమ్` కూడా తన ప్రభావాన్ని చూపిస్తే టాలీవుడ్ మళ్లీ ట్రాక్ లో పడినట్టే.