తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం నినాదాలు కామన్ గా మారుతున్నాయి. లీడర్ అనే కార్యక్రమం పెట్టి యువనేతలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కవిత వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు సీఎం సీఎం నినాదాలు హోరెత్తాయి. గతంలో చిలకజోస్యం చెప్పించుకున్నప్పుడు కూడా.. సీఎం అవుతారని చెప్పారు. తరచూ ఇలా కవిత పర్యటనల్లో ఆమె సీఎం అనే అభిప్రాయాలు, నినాదాలు వినిపిస్తూండటంతో కవిత క్లియర్ టార్గెట్ గానే ముందుకెళ్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల కేటీఆర్ సభల్లోనూ ఇలాగే వినిపిస్తున్నాయి. రెండు, మూడు సార్లు ఏసీబీ విచారణలకు హాజరై.. తిరిగి తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు.. కూడా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ సీఎం అనే నినాదాలతో..కేటీఆర్ ను సంతృప్తి పరిచారు. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు తమను తాము ఎక్కడికి వెళ్లినా సీఎం నినాదాలతో ఆహ్వానించేలా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
కవిత తెలంగాణ జాగృతిని మరో రేంజ్ కు తీసుకెళ్తానని అంటున్నారు. అంటే రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశంలో ఉన్నారని స్పష్టమవుతోంది. ఎవరు మద్దతుగా వచ్చినా రాకపోయినా తన రాజకీయ పయనం మాత్రం ప్రణాళికాబద్ధంగా ఉంటుందని ఆమె సంకేతాలిస్తున్నారు. అంతే కాదు.. తన టార్గెట్ కూడా ఏమిటో ఆమె మద్దతు దారుల నినాదాలతోనే స్పష్టతనిస్తున్నారు. ఈ పరిణామాలు. బీఆర్ఎస్కు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.