తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో.. ఎలాంటి నిర్ణయాలు అమలు చేయాలో కూడా తెలియక కొట్టు మిట్టాడుతోంది. సరైన నిర్ణయాలు తీసుకోలేక కిందా మీదా పడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ సోమవారమే ప్రకటించింది. రూట్ మ్యాప్ ప్రకటించింది. కొంత మందికి ఇంచార్జ్ బాధ్యతల్ని ఇచ్చారు. ఒక్క రోజు గడవక ముందే.. మంగళవారం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్లాల్సిన పని పడిందన్నారు. ఆమె ఢిల్లీకి వెళ్లాలని ఒక్క రోజు ముందు తెలియలేదా అని కాంగ్రెస్ పార్టీ నేతలకు వచ్చే డౌట్ కు ఎవరూ సమాధానం చెప్పలేరు.
అసలు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ .. నేరుగా ప్రత్యక్ష రాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న డౌట్ చాలా మందికి వచ్చింది. ఓ వైపు ముఖ్యమంత్రి పరిపాలిస్తూండగా.. సమస్యలు వింటానని ఆమె తెర మీదకు రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇదేం వ్యూహం అనుకున్నారు. ప్రజా సమస్యలు వినడంలో కానీ.. పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంలో కానీ ఎలాంటి బాధ్యత మీనాక్షి నటరాజన్ కు ఉండదు. కేవలం సొంత ఆర్గనైజేషన్ కాంగ్రెస్ లో సమస్యలు మాత్రమే ఆమె పరిష్కరించగలరు.
రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తగ్గించేందుకు మీనాక్షి నటరాజన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కొంత మంది అనుమానిస్తున్నారు. గతంలో ఉన్న ఇంచార్జ్ నేరుగా ఓ క్యాంప్ ఆఫీస్ నడిపి సమాంతర పాలన చేసే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు ఇంచార్జ్ నేరుగా ప్రత్యక్ష రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ కారణంగానే వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ఇక పాదయాత్ర ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.