మరి కొద్ది గంటల్లో ‘కింగ్డమ్’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా చాలామంది కెరీర్లకు చాలా చాలా ముఖ్యం. అందరికంటే ముందుగా విజయ్ దేవరకొండ కెరీర్‌కి ఈ హిట్ చాలా అవసరం. విజయ్‌కి వరుసగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. తను ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్లు కూడా ఓ ప్లానింగ్ తో చేస్తున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడితే, ఎలాంటి నెగిటివిటీ వస్తుందో అని తనని తాను కంట్రోల్ చేసుకొన్నాడు. సినిమా విడుదలయ్యేంత వరకూ మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాడు. విజయ్ తిరిగి పుంజుకోవాలన్నా, తన క్రేజ్ నిలుపుకోవాలన్నా… ఇదే తన చేతిలో ఉన్న అత్యంత విలువైన అవకాశం.
కథానాయిక భాగ్యశ్రీబోర్సేకి సోషల్ మీడియా అంతటా ఫ్యాన్సే. తన లుక్స్‌కి, డ్రస్సింగ్ స్టైల్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ‘మిస్టర్ బచ్చన్’ టైమ్ నుంచే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ సినిమా ఫ్లాప్. ‘బచ్చన్..’ ఫ్లాప్ అయినా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఫ్లాప్ హీరోయిన్‌కే ఇన్ని అవకాశాలు అంటే… సినిమా హిట్టయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. ‘కింగ్ డమ్’లో తనది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర అయితే కాదు. కొంత డిఫరెంట్ గానే డిజైన్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. అందుకే ఈసారి తనకు పేరుతో పాటుగా, హిట్ కూడా వస్తుందని ఆశిస్తోంది. భాగ్యశ్రీకి ఉన్న క్రేజ్‌కి హిట్ తోడైతే.. తన కెరీర్ మరింత స్పీడ్ అందుకోవడం ఖాయం.
తెలుగువాళ్లంతా ‘బక్కోడు’ అని ముద్దుగా పిలుచుకొనే అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. పాటలు ఇనిస్టెంట్ గా ఎక్కలేదు. అయితే థియేటర్లో మాత్రం ఇంపాక్ట్ చూపిస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలకు అనిరుథ్ సంగీతం తేలిపోతుందన్నది విమర్శకుల మాట. పైగా తమిళ సినిమాలకు అనిరుథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పుడూ ప్లస్సే. అలాంటి మ్యాజిక్ తెలుగు సినిమాకు జరగలేదు. అనిరుథ్ని మనవాళ్లు వాడుకోలేకపోతున్నారా? లేదంటే తెలుగు సినిమా అంటే తనే అంత ఎఫెక్ట్ పెట్టడం లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సినిమాతో అనిరుథ్ దానికి సమాధానం చెబుతాడన్నది అందరి ఆశ. ఈ సినిమా కోసం అనిరుథ్ చేసిన ఓ పాట ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆ పాట థియేటర్లో ఊపేస్తుందని ఓ టాక్.
బోల్డంత ప్రతిభ ఉన్న అండర్ రేటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కీలక పాత్రలకు ఆమోద ముద్ర వేస్తుంటాడు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించాడు. విజయ్ దేవరకొండ అన్నయ్యగా కనిపించబోతున్నాడు. తనక్కూడా ఓ హిట్ అవసరం. హీరోగా తన గ్రాఫ్ చాలా డల్ గా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొడితే – కొంత జోష్ వస్తుంది. ‘జెర్సీ’ సినిమాతో గౌతమ్ తనని తాను నిరూపించుకొన్నాడు. అయితే ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే అంతగా ఆడలేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులో హిట్ కొట్టి తన క్లాస్ మరోసారి చూపించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా కూడా బాగా ఆడితే… గౌతమ్ పెద్ద హీరోల దృష్టిలో పడినట్టే.
నిర్మాతగా నాగవంశీ ఈమధ్య వరుస హిట్లు కొట్టారు. ఆయన ఫామ్ కొనసాగిస్తే ‘కింగ్ డమ్’ కూడా హిట్ల జాబితాలో చేరిపోతుంది. తన జడ్జిమెంట్ పై మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఈ సినిమాపై ముందు నుంచీ నాగవంశీ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఎలాగైనా సరే, సూపర్ హిట్ కొట్టాలన్న తపన ఆయనలో కనిపించింది. వీళ్లందరి నమ్మకాలు ఎంత వరకూ నిజం అవుతాయన్నది రేపు ఈపాటికి తేలిపోతుంది.